American Army Official Band Plays Om Jai Jagadeesh Hare Song: అమెరికా అధ్యక్ష భవన్ వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ హిందూ కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఈ ఫెస్టివల్‌లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పాల్గొన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా వైట్ హౌస్‌లో యుఎస్ మిలిటరీ బ్యాండ్ వాయించిన ఓ సాంగ్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారుతోంది. 'ఓం జై జగదీష్ హరే'ని ప్రదర్శిస్తున్న వీడియోను ఆమె షేర్ చేశారు. 


"దీపావళికి వైట్ హౌస్ మిలిటరీ బ్యాండ్ ఓం జై జగదీష్ హరే వాయించడం చాలా అద్భుతంగా ఉంది. దీపావళి శుభాకాంక్షలు 🪔," అని X లో ఒక పోస్ట్‌లో రాశారు.






ఈ వారం ప్రారంభంలో US ప్రెసిడెంట్ జో బిడెన్ దీపావళి వేడుక నిర్వహించారు, 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లను, చట్టసభ సభ్యులు, అధికారులు, కార్పొరేట్ నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వనించారు. 
గీతా గోపీనాథ్ కూడా దీపావళి వేడుకకు హాజరయ్యారు. వైట్ హౌస్‌లో దీపావళి వేడుకకు హజరైన వారికి బైడెన్‌ ధన్యవాదాలు తెలిపారు.


"అధ్యక్షుడిగా, నేను వైట్‌హౌస్‌లో దీపావళి వేడుక నిర్వహించడం గౌరవంగా భావించాను. నాకు, ఇది చాలా గొప్ప విషయం. సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు, నా సిబ్బందిలో కీలక సభ్యులు, కమల నుంచి డాక్టర్ మూర్తి వరకు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అమెరికాను ముందుకు తీసుకెళ్లాలనే నా నిబద్ధతను నేను నిలబెట్టుకున్నందుకు గర్వపడుతున్నాను, ”అని దీపావళి కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి బైడెన్ అన్నారు.


ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉన్నందున దీపావళి కార్యక్రమానికి హాజరు కాలేదు.


అమెరికాను సౌత్ ఏషియన్ అమెరికన్ కమ్యూనిటీ సుసంపన్నం చేసిందని బైడెన్ అన్నారు. వైట్ హౌస్ బ్లూ రూమ్‌లో దీపాలు వెలిగిస్తూ ఈ కామెంట్స్ చేశారు. "అది నిజం. మీరు ఇప్పుడున్న దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత ప్రభావితం చేసే కమ్యూనిటీల్లో ఇది ఒకటి," అని చెప్పారు.