Chopped Fingertip: 


కలకలం రేపిన పార్సిల్..


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఇంటికి ఓ పార్శిల్ వచ్చింది. తెరిచి చూసిన అధికారులు కళ్లు తేలేశారు. ఆ పార్శిల్‌లో ఓ వేలు కనిపించింది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మేక్రాన్ అధికారిక నివాసానికే నేరుగా ఈ పార్సిల్ రావడం సంచలనం సృష్టించింది. పారిస్‌లోని Elysee Palaceకి ఇది వచ్చింది. ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మానసిక స్థితి బాగాలేని వ్యక్తి ఇలా పార్శిల్ పంపి ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఈ వారం మొదట్లోనే మేక్రాన్ పర్సనల్ స్టాఫ్‌లో ఒకరు దీన్ని తెరచి చూశారు. అయితే..దీనిపై ప్యాలెస్ సిబ్బంది మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. 2017లో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు మేక్రాన్. అప్పటి నుంచి పారిస్‌లోని ఈ ప్యాలెస్‌నే అధికారిక నివాసంగా వాడుకుంటున్నారు. జూన్‌లో ఓ 17 ఏళ్ల కుర్రాడిని కాల్చి చంపిన ఘటనతో ఆ దేశం అట్టుడుకిపోయింది. దాదాపు 15 రోజుల పాటు అల్లర్లు జరిగాయి. ప్రభుత్వ తీరుని విమర్శిస్తూ చాలా మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. వందలాది ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య దాడులు జరిగాయి. దీనిపై అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన మేక్రాన్ పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలోనూ ఎక్కడా విద్వేష పూరిత పోస్ట్‌లు, వీడియోలు పెట్టొద్దని అందరికీ సూచించారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి గుర్తు తెలియన వ్యక్తి వేలుని పార్సిల్‌గా పంపడం కలకలం రేపింది. 


ముగిసిన మోదీ పర్యటన..


 భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్ కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని బహుకరించారు. అలాగే ఆయన సతీమణి బ్రిగెట్టికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను కానుకగా అందజేశారు. అయితే సితార పైభాగంలో సరస్వతీ దేవీ, కింద భాగంలో వినాయకుడు, మధ్యలో రెండు నెమళ్లు ఉన్న సితారను చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. చందన కర్రతో చేసిన పెట్టెలో ఉంచిన చీరను పెట్టి బ్రిగ్గెట్ కు అందజేశారు. ఈ చీర కూడా అద్భుతమైన రంగుల్లో ఉంది. అలాగే ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్ ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు.అట్టహాసంగా జరిగిన బాస్టీల్ డే పరేడ్ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ తో మెక్రాన్... ప్రధాని మోదీని సత్కరించారు.