Rent A Dad Service:
చైనాలో సర్వీస్..
ఈ హడావుడి జీవితంలో అన్నింటికీ మనకి టైమ్ ఉండదు. సరుకులు కొనడానికి సమయం చాలకపోతే..ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. కూరగాయలూ అంతే. మన అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త వ్యాపారాలూ మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. ఫర్నిచర్‌తో సహా ఇంటికి కావాల్సినవి ఏవైనా రెంట్‌కి తీసుకునే వెసులుబాటు వచ్చేసింది. ఓ రోజుకి ఇంత అని పే చేసి వాడుకోవచ్చు. కానీ...రెంట్ సర్వీస్‌లు వస్తువులతోనే ఆగిపోవడం లేదు. మనుషులనూ అద్దెకి తీసుకునే వరకూ వచ్చేసింది. చైనాలోని ఓ బాత్‌హౌజ్ (Bathhouse) "నాన్నలను రెంట్‌కి ఇస్తోంది". అవాక్కయ్యారా..? ఇందులో ఎలాంటి మతలబు లేదు. మీరు విన్నది నిజమే. పిల్లలు అయ్యాక మహిళలకు సెల్ఫ్‌కేరింగ్‌కి చాలా తక్కువ టైమ్ ఉంటుంది. వాళ్లకు సమయం కేటాయించడంలోనే సరిపోతుంది. ఒక్కసారైనా పిల్లలను ఎవరికైనా అప్పగించి కాసేపు అలా సేద తీరాలని అనిపిస్తుంది. అదిగో అలాంటి తల్లుల కోసమే ఈ "Dads on Rent" సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మరి ఎవరికి పడితే వాళ్లను అప్పగించి అలా వెళ్లిపోలేరు కదా. అందుకే...ఆ చిన్నారులను కాసేపు అలా ఆడించేందుకు ఓ వ్యక్తిని అద్దెకి తీసుకుంటారు. కాసేపు ఆ చిన్నారికి ఆ వ్యక్తే నాన్న అయిపోతాడు. షెన్యాంగ్‌లోని ఓ బాత్‌హౌజ్ ఈ సర్వీస్ ఇస్తోంది. ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే అని ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. సోషల్ మీడియాలోనూ ఇది వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లల్ని చూసుకోడానికి ఎవరూ లేని వాళ్లకు ఈ సర్వీస్ బాగానే ఉపయోగపడుతోంది.
కారణమిదే..
చైనాలోని బాత్‌హౌజ్‌లలో మహిళలు, పురుషులకు వేరువేరు సెంటర్స్ ఉంటాయి. ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే...అక్కడికి ఆ చిన్నారులను తీసుకెళ్లడం చాలా మంది తల్లులకు ఇబ్బందిగా అనిపించింది. ముఖ్యంగా అబ్బాయిలు వస్తే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారట. ఎంత కొడుకులైనా వాళ్ల ముందు మసాజ్‌లు, పెడిక్యూర్‌లు చేయించుకోలేరుగా. బాత్ హౌజ్‌లో కాస్త రిలాక్స్‌డ్‌గా ఉండాలనుకుంటారు. బట్టలు మార్చుకుంటారు. నచ్చినట్టుగా ఉంటారు. బాడీకి, మైండ్‌కి కాస్త ఎనర్జీ వచ్చే దాక అక్కడే ఉంటారు. అలాంటప్పుడు అందరూ ప్రైవసీ కోరుకుంటారు. ఇది గమనించి ఓ బాత్‌హౌజ్ ఇలా "రెంట్ ఏ డాడ్" సర్వీస్‌ని తీసుకొచ్చింది. హైలైట్ ఏంటంటే...ఈ సర్వీస్‌ని ఫ్రీగానే వాడుకోవచ్చు. కేవలం అక్కడికి వచ్చే తల్లులకు మానసిక ప్రశాంతత కల్పించేందుకు ఈ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు నిర్వాహకులు. ఇక ఈ సర్వీస్‌పై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దేశమంతా ఇది అందుబాటులోకి వస్తే బాగుంటుందని అంటున్నారు అక్కడి నెటిజన్లు. ఇక్కడికి చిన్నారులను తీసుకొస్తే అద్దె నాన్నలే అన్నీ చూసుకుంటారు. వాళ్లను ఆడిస్తారు. స్నానం చేయిస్తారు. ఎటూ వెళ్లకుండా ఓ కంట కనిపెడతారు. ఇంత చేసినా వాళ్లు ఒక్క రూపాయి కూడా తీసుకోరు. కేవలం మహిళలకు తామిచ్చే గౌరవం అని చెబుతున్నారు నిర్వాహకులు. దాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకోవడం లేదని తేల్చి చెబుతున్నారు. ఈ సర్వీస్ వచ్చినప్పటికీ చాలా మంది తల్లులు ఇక్కడికి క్యూ కడుతున్నారు.
Also Read: పాకిస్థాన్ జైళ్లలో వందలాది మంది భారతీయులు, భద్రత లేక నరకయాతన