China Plane Crash: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్ట్రన్ ప్యాసింజర్ జెట్ నైరుతి చైనాలో కూలిపోయింది. భారీగా ప్రాణనష్టం ఉంటుందని స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ సోమవారం నివేదించింది. బోయింగ్ 737(Boeing Plane 737) విమానం గుయాంగ్‌ఝౌ ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో కుప్పకూలింది. దీంతో పర్వతాలలో మంటలు చెలరేగాయని సీసీటీవీ తెలిపింది. రెస్క్యూ టీమ్స్(Rescue Teams) ను సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు.









కొండను ఢీకొట్టిన విమానం


షాంఘైకి చెందిన చైనా ఈస్ట్రన్(China Eastern)... చైనా మూడు అగ్ర విమానయాన సంస్థలలో ఒకటి. 248 దేశీయ, అంతర్జాతీయ ప్రదేశాలకు ఈ సంస్థ సేవలందిస్తుంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ FlightRadar24 నుంచి వచ్చిన డేటా ప్రకారం, కూలిపోయిన విమానం కున్మింగ్ నుంచి గుయాంగ్‌ఝౌకి వెళ్లే MU5735 విమానం అని తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో కున్మింగ్‌ నగరం నుంచి గుయాంగ్‌ఝౌ నగరానికి బయల్దేరిన చైనా ఈస్ట్రన్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 విమానం మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. ఆ సమయంలో విమానం 3225 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ సమాచారంతో తెలుస్తోంది. ఆ వెంటనే గుయాంగ్‌ఝౌ ప్రాంతంలోని వుజౌ నగర సమీపంలో ఓ పర్వతాన్ని ఢీకొట్టి కూలినట్లు సమాచారం అందింది. ఈ విమానం 3.05 గంటలకు ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది కానీ ఈలోపే ప్రమాదం చోటుచేసుకుంది. 


నైరుతి చైనాలో చివరిగా సిగ్నల్


చైనీస్ నగరమైన వుజౌకి నైరుతి దిశలో ఈ విమానం నుంచి సిగ్నల్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విమానాన్ని జూన్ 2015లో బోయింగ్ సంస్థ చైనా ఈస్ట్రన్ కు డెలివరీ చేసింది. ఇది ఆరు సంవత్సరాలుగా పనిచేస్తుంది. దీంట్లో రెండు ఇంజిన్లు ఉంటాయి. బోయింగ్ 737 ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన విమానాలలో ఒకటి. చైనా ఈస్ట్రన్ 737-800, 737 మాక్స్‌తో సహా సాధారణ విమానాలను నిర్వహిస్తుంది. 


Also Read : Snake On Plane: విమానంలో స్నేక్ బాబు ఫ్రీ జర్నీ, ఆ పాము ఎలా దూరిందబ్బా?