China Earthquake: చైనాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 46కు చేరుకుంది. సిచువాన్ ప్రావిన్సులోని లూడింగ్కు సుమారు 39 కిలోమీటర్ల పరిధిలో భూకంప కేంద్రం ఏర్పడింది.
భారీ నష్టం
సిచువాన్ ప్రావిన్సు రాజధాని చెంగ్డులోనూ భూమి కంపించింది. భూకంప తీవ్రత 6.8గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి పలు కిలోమీటర్ల దూరం వరకు ఈ ప్రభావం కనిపించినట్లు పేర్కొన్నారు. ప్రకంపనల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిచువాన్ ప్రావిన్స్‌లోని పలు పట్టణాల్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పలు ఏరియాల్లో టెలి కమ్యూనికేషన్ లైన్లు తెగిపోయాయి.
రాజధాని చెంగ్డు, దానికి సమీపంలోని చాంగ్వింగ్ మెగాసిటీ సమీపంలో పలు భవంతులు కొద్ది సెకన్లు కంపించాయని చెబుతున్నారు. సహాయక చర్యల కోసం 500 మందికి పైగా సహాయ సిబ్బంది రంగంలోకి దింపారు.
తరచుగా
చైనాతో పాటు ఉత్తర పాక్‌లోని పలుచోట్ల సైతం భూమి కంపించింది. టిబెట్‌ను ఆనుకొని ఉన్న సిచువాన్ ప్రావిన్స్‌లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. టిబెటన్ పీఠ భూమిలోనూ తరచూ భూకంపాలు నమోదవుతూ ఉంటాయని అధికారులు తెలిపారు. 2008లో కూడా 8.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ విపత్తులో 69 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
అఫ్గాన్‌లో
మరోవైపు అఫ్గానిస్థాన్‌లో కొన్ని ప్రానిన్సుల్లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. కునార్‌తో పాటు మరికొన్ని ప్రావిన్సుల్లో భూమి కంపించింది.
కునార్ ప్రావిన్సులోని నూర్గుల్ జిల్లాలో భూకంపం కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమైనట్లు అధికారులు తెలిపారు.
Also Read: లక్కీ లేడి, తన కారు నెంబర్లు చెప్పి రూ.43 లక్షలు గెలుచుకుంది - ఇదిగో ఇలా!
Also Read: Kabul Blast: అఫ్గాన్‌లోని కాబూల్‌లో భారీ పేలుడు, రష్యా ఎంబసీ పరిసరాల్లో ఘటన - 20 మంది మృతి