China: చైనా ఏ పని చేసినా భారీగానే ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత భారీ ప్రాజెక్టులు ఎక్కువ శాతం చైనాలోనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం 10,520 మీటర్ల లోతైన భారీ రంధ్రాన్ని తవ్విన చైనా.. తాజాగా మరో పనికి పూనుకుంది. భూగర్భ అన్వేషణలో భాగంగా చైనా దూకుడుగా అడుగులు వేస్తోంది. భూమి లోపలికి మరో భారీ రంధ్రాన్ని తవ్వుతోంది. భూగర్భంలోని సహజ వాయు నిక్షేపాల వెతుకులాటలో భాగంగా చైనా 10 కిలోమీటర్ల మేర భారీ రంధ్రాన్ని తవ్వుతోంది. సిచువాన్ ప్రాంతంలో ఈ మేరకు పనులు కూడా ప్రారంభమై యుద్ధప్రాతిపదికగా సాగుతున్నాయి. గతంలో షింజియాంగ్ ప్రాంతంలో 10,520 మీటర్ల లోతైనా రంధ్రాన్ని తవ్విన డ్రాగన్ దేశం.. తాజాగా సిచువాన్ ప్రాంతంలో మరో బోరు తవ్వకాన్ని ప్రారంభించింది. ఈ రంధ్రం దాదాపు 10,000 మీటర్ల మేర ఉండనుందని చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ వెల్లడించింది. 


సహజవాయు నిక్షేపాల అన్వేషణలో భాగంగా


డ్రిల్లింగ్ సాంకేతికతను పరీక్షించడంతో పాటు, భూమి లోపలి అంతర్గత నిర్మాణంపై కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు షింజియాంగ్ లో భారీ రంధ్రాన్ని తవ్వినట్లు ఆ మధ్య చైనా చెప్పుకొచ్చింది. అయితే దాని గురించి ఇతర వివరాలేవీ బయటకు రాకుండా చైనా సర్కారు జాగ్రత్త పడింది. ప్రస్తుతం సిచువాన్ ప్రాంతంలో తవ్వుతున్న భారీ రంధ్రం ద్వారా భూమి లోపలి పొరల్లో సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయా.. ఉంటే వాటిని వినియోగించుకునే వీలు ఉంటుందా.. ఆయా గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు అయ్యే ఖర్చు ఎంత లాంటి సమాచారం కోసం ఈ భారీ డ్రిల్లింగ్ చేస్తున్నట్లు చైనా సర్కారు చెబుతోంది. 


సిచువాన్ ప్రాంతంలో షెల్ గ్యాస్ నిల్వలు


సిచువాల్ ప్రాంతంలో షెల్ గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అద్భుతమైన పర్వత శ్రేణులు అలరిస్తుంటాయి. అవే పెట్రోలియం సంస్థలకు సవాళ్లు విసురుతుంటాయి. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల వల్లే సిచువాన్ ప్రాంతంలో గ్యాస్ నిల్వల తవ్వకాలు ఎక్కువగా జరగవు. సిచువాన్ ప్రాంతంలో పాండాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. చైనా దేశీయులు పాండాలను పవిత్రంగా చూస్తారు. చాలా ఇష్టపడతారు. ఇక్కడ తవ్వకాలు జరిపితే భౌగోళిక పరిస్థితులు సవాళ్లు విసరడంతో పాటు ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఇన్ని రోజులు చైనా సర్కారు భావించింది. 


మరోవైపు చైనా ఇంధన వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పెట్రోలియం ఉత్పత్తి సంస్థలపై అక్కడి సర్కారు ఒత్తిడి పెంచుతోంది. విద్యుత్ కొరత, భౌగోళిక రాజకీయ కలహాలు, ప్రపంచ ధరల అస్థిరత కొనసాగుతున్న వేళ దేశీయంగా ఉత్పత్తి పెంచడం ద్వారా ఇంధన భద్రతను సాధించాలని కంపెనీలపై చైనా ఒత్తిడి చేస్తోంది. ఈ ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు సిచువాన్ ప్రాంతంలో భారీగా తవ్వకాలు జరుపుతోంది. కాగా, ప్రపంచంలోనే మానవులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలు ఉంది. కోలా సూపర్ డీప్ బోరు హోల్ గా ఈ రంధ్రాన్ని పిలుస్తారు. ఈ రంధ్రం ఏకంగా 12,262 మీటర్ల లోతు ఉంటుంది. ఈ భారీ రంధ్రాన్ని తవ్వడానికి ఏకంగా 20 ఏళ్లు పట్టింది. 1989 లో ఈ తవ్వకాలు పూర్తయ్యాయి.