China Building Collapse: చైనాలో గత వారం ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ హునాన్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 10 మందిని రక్షించారు. శిథిలాల కింద చిక్కున్న వారి కోసం చేపట్టిన సహాయక చర్యలు వారం రోజుల తర్వాత నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
ఎలా జరిగింది?
సెంట్రల్ హునాన్ రాష్ట్రంలోని చాంగ్షా నగరంలో ఏప్రిల్ 29న 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఆరు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది. శిథిలాల కింద 60 మందికిపైగా చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు వారం రోజుల పాటు సహాయక చర్యలు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి శిథిలాల కింద ఉన్న చివరి వ్యక్తిని కాపాడినట్లు అధికారులు తెలిపారు.
సజీవంగా
ఈ ఘటనలో ఆరు రోజుల అనంతరం ఓ మహిళ సజీవంగా బయటపడింది. దాదాపు 132 గంటలు శిథిలాల నడుమే బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ మహిళను గురువారం తెల్లవారుజామున సహాయక సిబ్బంది బయటకు తీశారు. ఆమె స్పృహలోనే ఉండటం విశేషం. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అరెస్ట్
భవనం కుప్పకూలిన ఘటనలో యజమాని సహా 9 మందిని అరెస్ట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టినట్లు కేసు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలను గుర్తించాలని ప్రభుత్వానికి సూచించారు.
Also Read: Assam News: పోలీస్ ఆన్ డ్యూటీ- కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన లేడీ సింగం!
Also Read: Kedarnath Shrine Opens: హరహర మహాదేవ శంభో శంకర- తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం