Assam News: "చట్టం ముందు ఏదీ ఎక్కువ కాదు.. చేసే పని కంటే దైవం లేదు" ఈ మాటలు ఆ పోలీస్ అధికారిణికి అక్షరాలా సూటైపోతాయి. అవును.. కాబోయే భర్త ఓ ఫ్రాడ్ అని తెలిసిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఆ లేడీ సింగం.
ఏం జరిగింది?
జున్మోని రాభా.. అసోంలోని నాగోన్ జిల్లాలో ఎస్ఐగా పని చేస్తోంది. ఇటీవల ఆమెకు రానా పోగాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు పోగాగ్. ఇది నమ్మిన ఎస్ఐ జున్మోని అతని మాటలు నమ్మి, మనిషి మంచివాడిలా కనబడటంతో ప్రేమించింది. వీరి ప్రేమకు పెద్ద వాళ్లు కూడా అంగీకరించారు. దీంతో గతేడాది అక్టోబర్‌లో వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లి చేయాలని నిశ్చయించారు.
ట్విస్ట్
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఆ తర్వాతే కాబోయే భర్త మోసగాడన్న సంగతి ఎస్‌ఐ జున్మోనికి తెలిసింది. చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి కోట్లల్లో రానా పోగాగ్ వసూలు చేశాడు. ఓఎన్‌జీసీలో పని చేస్తున్నానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన రానా.. మరికొంతమందిని మోసగించి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఈ విషయం తెలిసి షాక్ అయిన ఎస్ఐ జున్మోని దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఫిర్యాదులన్నీ నిజమని తెలియడంతో ఆమె ఆలస్యం చేయకుండా కాబోయే భర్తపై కేసు నమోదు చేసింది. దీంతో అసోం పోలీసులు రానా పోగాగ్‌ను గురువారం అరెస్ట్ చేశారు.
కృతజ్ఞతలు
మరోవైపు తన కళ్లు తెరిపించిన ముగ్గురు వ్యక్తులకు ఎస్‌ఐ జున్మోని రాభా ధన్యవాదాలు తెలిపారు. తనకు కాబోయే భర్త రానా పోగాగ్ పెద్ద మెసగాడన్న సంగతిని వారు చెప్పారని మీడియాతో ఆమె అన్నారు. డ్యూటీలో ఆమె చూపిన తెగువకు, ధైర్యానికి పోలీసు శాఖతో సహా నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. లేడీ సింగం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
అంతకుముందు జున్మోని ఈ ఏడాది జనవరిలో వార్తల్లో నిలిచారు. బిహ్‌పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్ పిలుపు మేరకు చట్ట ఉల్లంఘనకు పాల్పడిన భాజపా నేతలకు మద్దతు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు.
Also Read: Kedarnath Shrine Opens: హరహర మహాదేవ శంభో శంకర- తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం
Also Read: COVID Cases In India: కొత్తగా 3,545 కరోనా కేసులు నమోదు- ఎంత మంది మృతి చెందారంటే?