Prashant Kishor On Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చాలా పెద్ద నాయకుడని, ఆయనతో తనకెలాంటి మనస్పర్ధలూ లేవని పీకే అన్నారు. రాహుల్ గాంధీతో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు పీకే ఇలా బదులిచ్చారు.
కాంగ్రెస్‌ను కాదని
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కుదేలైన పార్టీని బతికించుకునేందుకు కొత్త వ్యూహకర్త కావాలని భావించి ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానించింది. ఆయన కూడా వెంటిలేటర్ మీద ఉన్న హస్తం పార్టీకి ప్రాణం నింపేందుకు ముందుకు వచ్చారు. అధినాయకత్వంతో నాలుగైదు సార్లు భేటీ అయ్యారు.
తన వ్యూహాలకు పదునుపెట్టి మిషన్ 400 అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదంతా గమనించిన హస్తం హైకమాండ్ పీకేను తమ నేతగా మార్చుకునేందుకు ప్రయత్నించింది.
కొంతకాలంగా జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానంటూ ఆ పార్టీ హైకమాండ్‌ను సంప్రదించారు. సోనియాగాంధీ, రాహుల్‌తోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన విధానంపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కానీ కాంగ్రెస్‌లో తాను అనుకున్న పదవిని, స్థాయిని సోనియా గాంధీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఆఫర్‌ను పీకే తిరస్కరించారు.
సెకండ్ ఇన్నింగ్స్
త్వరలోనే బిహార్ నుంచి ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు పీకే తెలిపారు. 3వేల కిమీ పాదయాత్రను అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రారంభిస్తానని ప్రకటించారు. ఇప్పుడప్పుడే పార్టీ స్థాపనపై ఆలోచించడం లేదని ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని పీకే అన్నారు.