దేశంలో లింగ నిష్పత్తిలో తేడా అంతకంతూ పెరిగిపోతోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం మెరుగైన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో అత్యధికంగా మహిళా నిష్పత్తి నమోదయింది. లద్దాఖ్ జననాల్లో  ప్రతి వెయ్యి మంది పురుషులకు 1104 మంది మహిళలు ఉన్నారు.  2020 సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ రిపోర్టు ఈ వివరాలను బయట పెట్టింది. నమోదైన జననాల ప్రకారం  లద్దాఖ్ తర్వాత   అరుణాచల్‌ప్రదేశ్‌ లో వెయ్యి మంది పురుషులకు  1011 మంది  మహిళలు.. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 984 , త్రిపురలో  974 , కేరళ  969 నిష్పత్తి నిమోదయింది. 


 జన్మించిన వారిలో ప్రతి వెయ్యి మంది బాలురకు, బాలికల సంఖ్యను లింగనిష్పత్తిగా పేర్కొంటారు. 2020లో అత్యల్ప లింగనిష్పత్తి మణిపూర్‌లో నమోదయింది. ఇక్కడ 1000 మందికి 880 మంది బాలికలే జన్మించారు. తరువాత దాద్రా నగర్‌ హవేలి డమాన్‌ అండ్‌ డయ్యూలో 898, గుజరాత్‌లో 909, హర్యానాలో 916, మధ్య ప్రదేశ్‌లో 921 మంది మహిళలు ఉన్నారు. 2019లో అత్యధిక లింగ నిష్పతి అరుణాచల్‌ ప్రదేశ్‌ (1024)లో నమోదైంది. అయితే కొన్ని రాష్ట్రాల నుంచి సమాచారం అందలేదు.  మహారాష్ట్ర, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాల గురించి సమాచారం లేదు. 2019లోనూ ఆర్‌జిఐకి ఈ నాలుగు రాష్ట్రాలు సమాచారం ఇవ్వలేదు. జనాభాలో లింగ భేదాన్ని గుర్తించడానికి లింగ నిష్పత్తి ముఖ్యమైన అంశమని నివేదిక తెలిపింది. దేశంలో ఏ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 880 కంటే తక్కువ నమోదు కాలేదు.


నివేదిక ప్రకారం 2020లో నమోదైన నవజాత శిశుమరణాలు సంఖ్య 1,43,379గా ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతం భాగం 23.4 శాతం మాత్రమే. మొత్తం నవజాత శిశువుల మరణాల్లో పట్ణణ ప్రాంతం భాగం 76.6 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని నవజాత శిశుమరణాలు నమోదుకాకపోవడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక తెలిపింది. జనన, మరణాల నమోదు చట్టం 1969 ప్రకారం జనన మరణాల రిజిస్ట్రార్‌కు జనన మరణాలను నివేదించడం తప్పనిసరి. జనన మరణాలను అవి సంభవించిన ప్రదేశంలో మాత్రమే నమోదు చేస్తారు. ఈ గణాంకాలు పక్కాగా ఉంటాయని భా విస్తున్నారు.


ప్రస్తుతం దేశంలో చైతన్యం పెరుగుతున్నందున భ్రూణ హత్యలు కూడా తగ్గుతున్నాయని.. ఈ కారణంగా లింగనిష్పత్తి కూడా పెరుగుతోందని అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే అనేక చట్టాలు కూడా తెచ్చారు .