జెర్రి గురించి తెలుసా?  ఓ వికృతాకార జీవి మన ఇళ్లలో రోజు ఏదో ఒక మూలన తిరుగుతూ కనిపిస్తూనే ఉంటాయి. ఒంటి నిండా కాళ్లతో ఉంటుంది. దాన్ని చూడగానే కొందరి ఒళ్లు జలదరిస్తుంది. వెంటనే భయం వేస్తుంది. ఎక్కడ కుడుతుందనే భయంతో చెప్పుతో కొట్టి చంపేస్తాం. అలాంటి వాటిపై పరిశోధకులు అధ్యయనం చేయడం మొదలు పెట్టారు.


చామనచాయ రంగుతో రెండు నుంచి నాలుగు అంగుళాల పొడవుతో 16 నుంచి 190 జతల కాళ్లతో ఉంటుంది. ఎవరైనా చూడగానే గగుర్పాటు కలిగించే ఆకారంతో ఉంటుంది. ఈ వింత జీవి గుట్టు తేల్చడంపై సీసీఎంబీ దృష్టి సారించింది. జన్యుక్రమాన్ని అంచనా వేసేందుకు పరిశోధనలు మొదలు పెట్టింది. జీవావరణ శాస్త్రం, పరిణామ క్రమం నియమాలను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. 


తూర్పు, పశ్చిమ కనుమల్లో పర్యటిస్తున్న సీసీఎంబీ పరిశోధకుల బృందం పలు జంతుజాతులపై అధ్యయనం చేస్తోంది. 400 మిలియన్‌ ఏళ్లనాటి పరిణామం, జీవుల శరీర ఆకృతి, ఇతర భౌతిక లక్షణాలు, వాటి ఆవాసాలపై పరిశోధనలు, అధ్యయనాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జాహ్నవి జోషి నేతృత్వంలోని పీహెచ్‌డీ స్కాలర్లు, పరిశోధకులు కేరళలోని పెప్పర వన్యప్రాణుల అభయారణ్యంలో అగస్త్యమలై బయోస్ఫియర్‌ రిజర్వ్‌ అడవులలో వందల కాళ్లు ఉండే ఆర్థోపోడ్స్‌ కోసం పరిశోధిస్తున్నారు. 


ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన జంతు నమూనాలకు బదులుగా క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించిన సెంటిపెడిస్‌ (జెర్రి), మిల్లిపెడిస్‌ (సహస్రపాది కీటకాలు) వంటి అకశేరుకాలపై జాహ్నవి జోషి నేతృత్వంలోని పీహెచ్‌డీ స్కాలర్లు, పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. వాటి జన్యు వైవిధ్యాన్ని పరిశోధించడం ద్వారా వాటి జాతులలో అధిక జీవవైవిధ్యం ప్రాబల్యాన్ని నిర్ధారించవచ్చని వారు చెప్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ కనుమలలో పర్యటిస్తున్న తమ బృందం సెంటిపెడిస్‌లను సంగ్రహించి వాటిని పెట్టెల్లో నిల్వ చేసి సీసీఎంబీకి తరలించనున్నారు.


జెర్రి గురించి ఈ విషయాలు తెలుసా!
చూడటానికి భయంకరంగా ఉండే జెర్రి కుడితే చనిపోతారని చాలా మంది అనుకుంటారు. కానీ జెర్రి కుడితే ప్రాణాలు పోవు. నొప్పి మాత్రమే ఉంటుంది. దాని విషాన్ని తట్టుకునే శక్తి మనుషులకు ఉంటుంది. ఎంత పెద్ద జెర్రి కుడితే అంతగా నొప్పి ఎక్కువ ఉంటుంది. అవి కుట్టిన చోట ఎర్రగా అవుతుంది. ఈ నొప్పి కొన్ని గంటలు లేదా రోజులు కూడా ఉంటుంది. కొంత మందికి జెర్రి కుడితే జ్వరం, వికారం, దురద, దద్దుర్లు వంటివి కూడా వస్తాయి. జెర్రి కుట్టిన ప్రదేశాన్ని గోరు వెచ్చటి నీటితో కుట్టిన ప్రదేశాన్ని కడగాలి. ఐస్ ముక్కలను గాయంపై ఉంచవచ్చు. పరిస్థితి తీవ్రం అయితే డాక్టర్‌ని సంప్రదించాలి. 1932లో మాత్రమే జెర్రి కుట్టినప్పుడు ఓ మరణం సంభవించింది. ఇంకెప్పుడూ అలా జరగలేదు.  


సాధారణంగా జెర్రులు రాళ్ల కింద ఉంటాయి. వానాకాలంలో రాళ్ల కిందకు నీరు రాగానే అక్కడ ఉండలేక వేరే ప్రదేశం వెతుక్కుంటాయి. అలాంటి సందర్భంలో అవి ఇళ్లలోకి వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా బయటకు పంపాలే గానీ చంపకూడదు అంటున్నారు పరిశోధకులు. బొద్దింకలు, పురుగులు, కీటకాలు, ఈగలు, దోమలు, నల్లులు వంటివాటిని జెర్రులు ఆహారంగా తీసుకుంటాయట. అందువల్ల జెర్రి ఇంట్లో ఉన్నా ఏమీ కాదంటున్నారు. అయితే షూస్, చెప్పుల వంటి వాటిలో, చీకటి ప్రదేశాల్లో జెర్రులు దాక్కుంటాయనీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.