మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. వరద బీభత్సంతో 2వేల మందికి ప్రాణాలు కోల్పోయారు.  వేలాది మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డేనియల్ తుపాను మధ్యధరా సముద్ర ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపింది. టర్కీ, బల్గేరియా, గ్రీస్‌లు కుండపోత వర్షాలతో అతలాకుతలమయ్యాయి. తాజాగా లిబియాలో భారీ వరదలు సంభవించాయ్. దీంతో ఎత్తయిన భవనాలు నేలమట్టమయ్యాయి. వీధుల్లో వరదనీరు అడుగుల మేర నిలిచిపోయింది.  డేనియల్‌ తుపాను ప్రభావంతో డెర్నా, జబల్‌ అల్ అఖ్దర్‌, అల్‌-మార్జ్‌ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 


దెర్నా నగరంలో సంభవించిన వరదల ధాటికి 2వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రధానమంత్రి ఒసామా హమద్ తెలిపారు. దెర్నాలోని అనేక ప్రాంతాలు వరదలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. డేనియల్ తుపాను ధాటికి ఇప్పటికే తూర్పు లిబియాలోని అనేక ప్రాంతాల్లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా నగరంలో పరిస్థితి భయానకంగా మారింది. విద్యుత్​ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. చుట్టూ వరద నీరు చేరడం వల్ల ఇళ్లల్లో ఉన్న ప్రజలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కొందరికి ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు.  దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వరదల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కకుపోయారు. సైన్యం, సహాయక బృందాలు వారిని రక్షించడానికి తీవ్రంగా యత్నిస్తున్నాయి. 


డెర్నా పట్టణంలోని నదిపై ఉన్న ఆనకట్ట వరదలతో కూలిపోవడంతో విపత్తు సంభవించిందని లిబియా నేషనల్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారీ చెప్పారు. ఈ వరద విపత్తులో గల్లంతైన వారి సంఖ్య 6 వేలమంది దాకా ఉంటుందని వెల్లడించారు. గత వారం గ్రీస్ దేశాన్ని ముంచెత్తిన తుపాన్ విపత్తు మధ్యధరా సముద్రంలోకి దూసుకెళ్లింది. వరదల వల్ల డెర్నా నగరంలో భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. లిబియాలోని సముద్ర తీరంలోని భవనాలు ధ్వంసం అయ్యాయి.


ఆరు మిలియన్లకుపైగా జనాభా కలిగిన లిబియా.. దశాబ్దానికిపైగా ఘర్షణలతో సతమతమవుతోంది. మౌలిక సదుపాయాల లేమితో బాధపడుతోంది. 2011లో నాటో మద్దతుతో కూడిన తిరుగుబాటు కారణంగా నియంత గడాఫీ మరణం తర్వాత లిబియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది