Saree Walkathon in UK: భారత్ లో చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించేలా, చేనేత కార్మికులను ప్రోత్సహించేలా ఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం. ఆగస్టు ఏడో తేదీ నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా బ్రిటన్ రాజధాని లండన్ లో శారీ వాక్‌థాన్- 2023 నిర్వహించారు. ఐఐడబ్ల్యూ సహకారంతో బ్రిటిష్ ఉమెన్ ఇన్ శారీస్ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ దీప్తి జైన్ నేతృత్వంలో ఈ వేడుక జరిగింది. అత్యం ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి బ్రిటన్ లోని వివిధ ప్రాంతాల నుంచి 500 మందికి పైగా భారతీయ మహిళలు హాజరయ్యారు. శారీ వాక్‌థాన్ లో భారత్ లో తయారైన అందమైన చేనేత చీరలు ధరించారు. శారీ వాక్‌థాన్-2023 సెంట్రల్ లండన్ లోని ట్రాఫాల్గర్ స్క్వేర్ నుంచి ప్రారంభమై 10-డౌనింగ్ స్ట్రీట్ మీదుగా పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ముగిసింది. వాక్‌థాన్-2023లో పాల్గొన్న మహిళలు జాతీయ గీతాలాపనతో, ప్రాంతీయ భాషా గేయాల ఆలాపనతో ఆద్యంతం వాక్‌థాన్ నిర్వహించారు. 






తెలంగాణకు చెందిన గద్వాల్, పోచంపల్లి, పోచంపల్లి ఇక్కత్, నారాయణ పేట, గొల్లభామ వంటి చేనేత చీరలతో 40 మందికి పైగా తెలంగాణ మహిళల బృందం ఈ శారీ వాక్‌థాన్ 2023 లో పాల్గొంది. భారతీయ చేనేత వస్త్రాలపై అవగాహన పెంచేందుకు, భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బ్రిటిష్ ఉమెన్ ఇన్ శారీస్ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ దీప్తి జైన్ తెలిపారు. ఈ తరహా అంతర్జాతీయ ప్రదర్శనల వల్ల చేనేత వస్త్రాలకు, చీరలకు ప్రచారం కల్పించినట్లు అవుతుందని, నేతన్నల జీవనోపాధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఈ శారీ వాక్‌థాన్ లో పాల్గొన్నట్లు తెలిపారు.