Bangladesh Jeshoreshwari Temple: బంగ్లాదేశ్‌లోని సత్ఖిరాలోని శ్యామ్‌నగర్‌లో ఉన్న జెషోరేశ్వరి ఆలయంలోని కాళి మాత కిరీటాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. గురువారం మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల మధ్య ప్రాంతంలో చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఆలయ పూజారి దిలీప్ ముఖర్జీ రోజువారీ పూజలు ముగించుకుని తిరిగి వెళ్లిన టైంలో కిరీటం తస్కరణకు గురైనట్టు అనుమానిస్తున్నారు. ఉదయాన్నే వచ్చి ఆలయాన్ని శుభ్రపరిచే సిబ్బంది కిరీటం లేని విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. 2021 మార్చిలో ఆలయాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ దేవీకి ఈ కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు.
51 శక్తిపీఠాల్లో ఒకటి
కిరీటం చోరీకి గురైన విషయంపై శ్యామ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తైజుల్ ఇస్లాం మాట్లాడుతూ.. దొంగను గుర్తించేందుకు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని తెలిపారు. చోరీకి గురైన కిరీటం వెండి, బంగారు పూతతో తయారైంది. సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగిన అంశం కాబట్టి వేగంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. హిందూ పురాణాల ప్రకారం భారతదేశం, పొరుగు దేశాల్లో విస్తరించి ఉన్న 51 శక్తిపీఠాల్లో జెషోరేశ్వరి ఆలయం ఒకటి. "జెషోశ్వరీ" అనే పేరుకు "జేషోర్ దేవత" అని అర్థం.
ప్రధాని మోదీ 2021 మార్చి 27న బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా జెషోశ్వరీ ఆలయాన్ని సందర్శించారు. ఆయన స్వయంగా దేవతను సందర్శించి కిరీటాన్ని దేవత తలపై ఉంచారు.
ప్రసిద్ధ హిందూ దేవాలయం జెషోశ్వరీ కాళీ టెంపుల్
అప్పట్లో పిఎం మోడీ ఆలయాన్ని సందర్శించిన వీడియో షేర్ చేశారు. COVID-19 మహమ్మారి విజృంభణ తగ్గిన తర్వాత ఆయన మొదటిసారి అప్పట్లో బంగ్లాదేశ్ సందర్శించారు. సత్ఖిరా జిల్లాలోని శ్యామ్ నగర్‌లోని గ్రామంలో ఉందీ ఆలయం.
శక్తి పీఠాలు ఎన్ని అనే దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. 18, 51, 52, 108 అని ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తుంటారు. పిలవని పేరంటానికి తన తండ్రి ఇంటికి వెళ్తుందిసతీదేవి. ఆమెకు అక్కడ ఘోర అవమానం జరుగుతుంది. దాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలోకి దూకుతుంది. ఆ యాగానికి ఆటంకం కలిగించదన్న కోపంతో సతీదేవి మృతదేహాన్ని పట్టుకొని శివుడు ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. శివుడు జగద్రక్షణాకార్యాన్ని మానేశాడని విష్ణు మూర్తి వద్ద దేవతలు మొరపెట్టుకుంటారు. అప్పుడు కలుగుజేసుకున్న విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాడట. ఒక్కో ముక్క పడిన ప్రదేశాన్ని ఒక్కో శక్తిపీఠంగా పిలుస్తారు. ఇప్పుడు మన చెప్పుకునే బంగ్లాదేశ్‌లో కాళ్లు చేతులు పడ్డాయని అంటారు.
ఈ ఆలయాన్ని 12వ శతాబ్దపు రెండో భాగంలో అనారి అనే బ్రాహ్మణుడు నిర్మించాడని నమ్ముతారు. అతను జెషోరేశ్వరి పీఠం కోసం 100 తలుపుల ఆలయాన్ని నిర్మించాడు. దానిని 13వ శతాబ్దంలో లక్ష్మణ్ సేన్ పునరుద్ధరించాడు. చివరికి 16వ శతాబ్దంలో రాజు ప్రతాపాదిత్య ఆలయాన్ని పునర్‌నిర్మించాడు అంటారు.