Apple: టెక్ అంటే యాపిల్.. యాపిల్ అంటే టెక్ అనేంతగా.. తన ముద్ర వేస్తోంది యాపిల్ సంస్థ. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే పరిమితం అయిన ఈ సంస్థ ఉత్పత్తులు.. ఇప్పుడు క్రమంగా సాధారణ ప్రజలకు కూడా చేరువ అవుతున్నాయి. యాపిల్ లోగో అంటేనే హుందాతనానికి, ఆడంబరానికి, ప్రత్యేకతకు మారు పేరు. నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో యాపిల్ ఎప్పటికీ నంబర్ వన్ గానే ఉంటూ వస్తోంది. ధర ఎక్కువైనా.. పూర్తి స్థాయి మన్నిక, భద్రత సంవత్సరాలు గడిచినా వేగం తగ్గకపోవడం లాంటి సౌకర్యాల వల్ల యాపిల్ ఉత్పత్తులకు ఆ క్రేజ్ వచ్చింది. అంతలా తన ఉత్పత్తులతో క్రేజ్ సంపాదించుకున్న ఈ కంపెనీ.. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్ తో సహా అనేక దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం. 


3.039 ట్రిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో యాపిల్ సంస్థ ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 10 కంపెనీల జాబితాలో 8 స్థానాలు అమెరికన్ కంపెనీలవే కావడం గమనార్హం. యాపిల్ ఇటీవలె 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను దాటిన ప్రపంచంలోనే మొదటి కంపెనీగా అవతరించింది. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్.. జీడీపీల పరంగా ప్రపంచంలోని మొదటి 10 దేశాల జీడీపీ కంటే ఎక్కువ. యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇండియా, యూకే దేశాల జీడీపీ కంటే కేవలం కాస్తంతా మాత్రమే వెనక ఉంది.


మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా యాపిల్ తర్వాతి స్థానం మైక్రోసాఫ్ట్ ది. 2459 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో రెండో స్థానంలో ఉంది. 2084 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో సౌదీ అరాంకో మూడో స్థానంలో నిలిచింది. అల్ఫాబెట్(గూగుల్), అమెజాన్, NVidia, టెస్లా, మెటా(ఫేస్‌బుక్‌), బెర్క్‌షైర్ హాత్‌వే, టీఎస్ఎంసీ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


జీడీపీ పరంగా మొదటి స్థానంలో అమెరికా, భారత్ ఎక్కడంటే?


26,854 బిలియన్ డాలర్ల జీడీపీతో అమెరికా మొదటి స్థానంలో నిలవగా.. 19,374 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది. జపాన్ 4,410 బిలియన్ డాలర్లు, జర్మనీ 4,309 బిలియన్ డాలర్లతో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచాయి. 3,750 బిలియన్ డాలర్ల జీడీపీతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్‌డమ్ 3,159 బిలియన్ డాలర్లతో భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిన్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.