Rice Shortage in US:
బ్యాన్ ఎఫెక్ట్..
నాన్ బాస్మతీ రైస్ ఎగుమతిపై ఇండియా బ్యాన్ విధించిన వెంటనే ఆ ఎఫెక్ట్ అమెరికాలో గట్టిగా కనిపిస్తోంది. రేషన్ షాప్‌లలో సరుకుల కోసం క్యూలు కట్టినట్టు అన్ని సూపర్ మార్కెట్‌ల బయట పెద్ద పెద్ద లైన్‌లు కనిపిస్తున్నాయి. కొన్ని స్టోర్‌లలో అయితే ఎగబడి మరీ బియ్యం బస్తాలు లాగేసుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియా బ్యాన్ విధించడం ఏమో కానీ...ప్రస్తుతం అమెరికాలో బియ్యం వ్యాపారం మాత్రం కళకళలాడిపోతోంది. ఆ బిజినెస్ చేసే వాళ్ల గల్లా పెట్టె నిండిపోతోంది. వారం రోజుల క్రితం భారత్ ఈ నిర్ణయం తీసుకోగా...అప్పటి నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క అమెరికాలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ మార్కెట్‌ని కుదిపేసింది ఈ నిర్ణయం. వాషింగ్టన్‌లో అయితే...సూపర్ మార్కెట్‌లలో ఇసకేస్తే రాలనంత జనం ఉంటున్నారు. "ఒక రైస్ బ్యాగ్ దొరికినా చాలు" అని గంటల తరబడి అక్కడే నిలబడుతున్నారు. "ఉదయం 10 గంటల నుంచి అన్ని వీధులు తిరుగుతున్నాం. సాయంత్రం 4 గంటలకు ఓ చోట ఒకే ఒక్క రైస్ బ్యాగ్ దొరికింది" అని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అక్కడ ఉండే NRIలకూ తిప్పలు తప్పడం లేదు.
ముందు గోధుమలు..ఇప్పుడు బియ్యం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గోధుమల ఎగుమతులు తగ్గిపోయాయి. ఇప్పటికే అమెరికాలో వీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయంతో బియ్యానికీ దిక్కు లేకుండా పోయింది. దేశీయంగా ధరలు తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడి పౌరులకు అందుబాటు ధరలోనే బియ్యం అందాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుండి ఎగుమతులను ఆపేసింది. ప్రీమియం గ్రేడ్ బాస్మతీ రైస్ ఎగుమతులపై ఎలాంటి బ్యాన్ లేకపోయినా...ముందుగానే వాటినీ పెద్ద మొత్తంలో కొనుక్కుంటున్నారు అమెరికన్‌లు. ఇప్పటికే ధరలు రెట్టింపయ్యాయి. మరి కొన్ని రోజులు గడిస్తే ఇవి మూడింతలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే...ఎక్కువ మొత్తంలో స్టాక్ పెట్టుకునేందుకు స్టోర్‌లలో ఇలా పడిగాపులు కాస్తున్నారు అక్కడి ప్రజలు. చాలా దేశాల్లో బియ్యం కొరత వల్ల బియ్యం ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత్ ను కోరింది. ఈ కొరత వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో నిర్దిష్ట రకం బియ్యం ఎగుమతిపై పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
Also Read: కుతకుత ఉడికిపోతున్న భూమి, జులైలో పాత రికార్డులన్నీ బద్దలు - గ్లోబల్ బాయిలింగ్ మొదలైందా?