School Girls Poisoned: ఆఫ్గనిస్తాన్‌ లో బాలికలపై విషప్రయోగం జరిగింది. ఉత్తర ఆఫ్గనిస్తాన్ లోని రెండు పాఠశాలలో ఈ విషప్రయోగం జరిగింది. ఇందులో దాదాపు 80 మంది బాలికలు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. బాలికలు పాఠశాలలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆఫ్గన్ లోని సార్-ఇ పోల్ ప్రావిన్స్ లోని నస్వాన్-ఎ - కబోద్ ఆబ్ పాఠశాలలో 60 మంది విద్యార్థినిలపై, నస్వాన్-ఎ-ఫైజాబాద్ పాఠశాలలో 17 మంది బాలికలపై విష ప్రయోగం జరిగినట్లు ప్రావిన్షియల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ మహ్మద్ రహ్మానీ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఒకటి నుంచి 6వ తరగతి చదువుతున్న బాలికలపై మాత్రమే ఈ విష ప్రయోగం జరిగిందని తెలిపారు. 


ఈ విష ప్రయోగం వ్యక్తిగత విద్వేషం, పగ వల్లే జరిగి ఉండొచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఎవరిపైనైనా పగతోనే ఇలా సుపారీ ఇచ్చి విష ప్రయోగం జరిపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు బాలికల  పాఠశాలల్లోకి వచ్చి విషం పెట్టి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సార్-ఇ-పోల్ ప్రావిన్స్ పోలీసు ప్రతినిధి డెన్ మొహమ్మద్ తెలిపారు. ప్రస్తుతం విష ప్రయోగానికి గురైన బాలికలకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. 


చట్టమే ముఖ్యం..


అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి మహిళా హక్కుల్ని పూర్తిగా అణిచివేస్తున్నారు. ముఖ్యంగా వాళ్లు చదువుకోకుండా అడ్డుకుంటోంది తాలిబన్ ప్రభుత్వం. యూనివర్సిటీ విద్యపై ఇటీవల నిషేధం విధించింది. స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాలపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అయినా.. తాలిబన్‌లు మాత్రం ఇవేవీ లెక్క చేయడం లేదు. పైగా.. దీని గురించి మాట్లాడటానికీ ఆసక్తి చూపించడం లేదు. "మహిళలపై ఆంక్షల్ని తొలగించాలనే విషయం అసలు మా ప్రియారిటీ కానే కాదు" అని తాలిబన్ ప్రతినిధి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.


ఇరాన్‌లో బాలికలు, మహిళలపై విష ప్రయోగం


ఇరాన్ లో చదువుకుంటున్న అమ్మాయిలపై విష ప్రయోగాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 900 మందికిపైగా బాలికలపై విషప్రయోగం జరిగింది. అమ్మాయిలను విద్యకు దూరం చేయాలనే చాందసవాద ఆలోచనలతోనే కొందరు ఈ దాడులు చేశారు. మొదట కోమ్ అనే నగరంలో గతేడాది నవంబర్ 30న ఓ హైస్కూల్ లో విష ప్రయోగం జరిగింది. ఈ ఘటనలో 18 మంది బాలికల ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి కోమ్ నగరంలోని 13 పాఠశాలలపై విషప్రయోగం జరిగింది. ఇందులో 100 మందికి పైగా అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోనూ విషప్రయోగం జరగ్గా.. 35 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఏకంగా 5 ప్రావిన్సుల్లోని పాఠశాలల్లో విషప్రయోగం జరిగింది. 


చంపడం కాదు భయపెట్టడమే లక్ష్యం


విషప్రయోగం చేసి బాలికలను చంపడం వారి ఉద్దేశంగా కనిపించడం లేదు. కేవలం చదువుకోవడంపై బాలికలకు భయం కలిగించాలని అలా పాఠశాలలకు దూరం చేయాలనే విష ప్రయోగాలు చేస్తున్నారని నిపుణులు వెల్లడించారు. ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూనెస్ పనాహి సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నారు.