Kathleen Folbigg: నలుగురు చిన్నారుల మృతి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఓ మహిళను తాజాగా ఆస్ట్రేలియా కోర్టు విడుదల చేసింది. 2003 లో కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ను దోషిగా నిర్ధారిస్తూ శిక్ష విధించింది అక్కడి కోర్టు. పాట్రిక్, సారా, సెలెబ్, లారా ఎలిజబెత్ అనే నలుగురు చిన్నారులను చంపినట్లు కాథ్లీన్ ఫోల్‌ బిగ్‌పై ఆరోపణలు వచ్చాయి. 1990 నుంచి 1999 మధ్య కాథ్లీన్ తన నలుగురు పిల్లలను చంపిందని.. చనిపోయే సమయంలో ఆ పిల్లల వయస్సు 19 రోజుల నుంచి 19 నెలలు ఉన్నట్లు అప్పట్లో అధికారులు తేల్చారు. కాథ్లీన్ ఫోల్‌బిగ్‌కు అప్పట్లో వరస్ట్ ఫీమేల్ సీరియల్ కిల్లర్ (Worst Female Serial Killer) అనే పేరు కూడా పెట్టారు. తనపై ఆరోపణలు వస్తున్నప్పటి నుంచి కాథ్లీన్ తన పిల్లలను హత్య చేయలేదని చెబుతూనే వస్తోంది. తాను ఏ తప్పూ చేయలేదని, పిల్లలు ఎలా చనిపోయారో తనకు తెలియదని చెప్పింది. కానీ అప్పట్లో తన మాటలు ఎవరూ వినకుండా తననే దోషిగా గుర్తించి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించారు. 


2003 నుంచి జైల్లోనే కాథ్లీన్ ఫోల్‌బిగ్‌


2003 నుంచి కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ జైలులో గడుపుతోంది. డైలీ మెయిల్ నివేదికల ప్రకారం, 1990 నుంచి 1999 మధ్య కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ తీవ్ర మానసిక ఒత్తిడి, కోపం సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ కారణంగానే కాథ్లీన్ తన నలుగురు పిల్లలను చంపిందని ఆరోపించారు. ఈ ఆరోపణలను అప్పటి నుంచి కాథ్లీన్ ఖండిస్తూనే వస్తోంది. తన పిల్లలు సహజంగానే మరణించారని, తాను చంపలేదని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. పిల్లలకు ఊపిరాడకుండా చేసి హతమార్చిందని తనకు వ్యతిరేకంగా న్యాయవాదులు వాదనలు వినిపించారు. 


ఎవిడెన్స్ ఆధారంగా దోషిగా తేల్చిన కోర్టు 
కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ ను సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ (సందర్భోచిత సాక్ష్యాలు) ఆధారంగా తనను దోషిగా తేల్చారు. నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే.. ఆ సంఘటనను నిరూపించడానికి, ఘటన జరిగిన ప్రదేశంలోని పరిస్థితుల ఆధారంగా ఒక నిర్ధారణకు వస్తారు. అలా సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ ను సాక్ష్యంగా భావించి కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ దోషిగా తేల్చి జైలు శిక్ష విధించారు.


2019లో రెండోసారి దోషిగా తేల్చిన కోర్టు


కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ ను నిర్దోషిగా విడుదల చేయాలని 2019లో కొందరు పిటిషన్ వేశారు. అప్పుడు న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం రెజినాల్డ్ బ్లాక్ అనే న్యాయమూర్తి పర్యవేక్షణలో మరోసారి విచారణ చేసింది. ఆయన సమర్పించిన 500 పేజీల నివేదికలో కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ దోషిగా తేల్చారు. 


అన్యాయం జరుగుతోందని నోబెల్ గ్రహీతల వినతిపత్రాలు


కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ కు క్షమాభిక్ష ఇవ్వాలని దాదాపు 90 మంది వైద్యులు, శాస్త్రవేత్తలు డిమాండ్ చేశారు. వీరిలో ఇద్దరు నోబెల్ బహుమతి విజేతలు - పీటర్ డోహెర్టీ, ఎలిజబెత్ బ్లాక్‌బర్న్‌ కూడా ఉండటం గమనార్హం. కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ నలుగురు పిల్లలు చనిపోవడానికి అరుదైన జన్యు వ్యాధి కారణమని వారు గుర్తించారు. న్యూ సౌత్ వేల్స్ గవర్నర్‌కు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ కేసులో కాథ్లీన్ ఫోల్‌బిగ్‌ కు అన్యాయం జరుగుతోందని, దానిని అరికట్టాలని కోరారు. సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ ను పరిగణనలోకి తీసుకుంటే వైద్యపరమైన, శాస్త్రీయమైన ఆధారాలు విస్మరించడమే అవుతుందని పేర్కొన్నారు. 


జన్యు సమస్యతోనే పిల్లలు మృతి


1991 లో 8 నెలల వయస్సున్న పాట్రిక్ మరణానికి మూర్చ వ్యాధి అస్ఫిక్సియా కారణమని వైద్యులు గుర్తించారు. 1993లో 10 నెలల వయస్సులోని సారా మరణానికి ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్(Sudden Infant Death Syndrome) కారణమని తేల్చారు. 1999లో 19 నెలల లారా చనిపోవడానికి కారణాలు తెలియదని చేప్పారు. అలాగే 19 రోజుల కాలేబ్ మరణానికి కూడా SIDS కారణమని వైద్యులు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు.