Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీ వెనుక అద్దం చూస్తూ భారతదేశం అనే కారు నడుపుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహూల్ గాంధీ విమర్శించారు. అద్దంలో చూసే కారు నడుపుతూనే.. ప్రమాదం ఎందుకు జరిగిందనే పరిస్థితుల్లో ప్రధాని మోదీ, బీజేపీ ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. కాషాయదళ నేతలంతా ఎప్పుడూ గతం గురించి మాట్లాడతారని.. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించరని చెప్పారు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే సామర్థ్యం వారికింకా రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


దేశంలో మతతత్వ రాజకీయాలు చేయడంలో ఆర్ఎస్ఎస్ ముందుంటుందంటూ కామెంట్లు చేశారు రాహుల్. ద్వేషాన్ని ద్వేషంతో తెంచలేమని, ప్రేమతో మాత్రమే నివారించగలమని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ న్యూయార్క్ లోని జవిట్స్ సెంట్ లో భారత సంతతి ప్రజలతో సమావేం అయ్యారు. ఈక్రమంలోనే ఒడిశా రైలు ప్రమాద ఘటన, మృతుల కుటుంబాల ఆవేదన, క్షతగాత్రుల బాధలు గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. 






ఎప్పుడూ గతం గురించే.. భవిష్యత్తు గురించి మాట్లాడే సత్తానే లేదు!


రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని బీజేపీ నేతలను ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ 50 ఏళ్ల క్రితం ఈ రైల్వే మార్గాన్ని నిర్మించిందని మీద వేసేస్తారని చెప్పారు. అలాగే పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, పరిణామ సిద్ధాంతం ఎందుకు తీసేశారని అడిగినా కాంగ్రెస్ 60 ఏళ్ల క్రితం పెట్టింది కాబట్టి అంటూ సమాధానాలు చెబుతారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. వారు స్పందించే తీరు, చెప్పే సమాధానాలు చూస్తుంటే గతాన్ని చూడమని పదే పదే చెబుతున్నట్లు అనిపిస్తుందే తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించమన్నట్లు అనిపించదని అన్నారు. ఎక్కడ ఏం జరిగినా గతంలో ఉన్న వాళ్లను నిందించడమే తప్ప అప్పుడు ఏం చేయాలనే దాని గురించి మాత్రం ఆలోచించరంటూ ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో మరోసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని చెప్పరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగితే బ్రిటీష్ వారి వల్లే ఇది జరిగిందని తామెప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. ఇది తన బాధ్యత కాబట్టి రైల్వేశాఖ మంత్రిగా తాను రాజీనామా చేస్తానని కాంగ్రెస్ మంత్రి చెప్పినట్లు తనకు ఇప్పటికీ గుర్తుందన్నారు. కానీ ప్రస్తుత మంత్రి తనకేం సంబంధం లేదన్నట్లుగా ఉన్నావరి రాహుల్ గాంధీ వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలకు ఉన్న తేడా ఇదేనని... మన దేశంలో ఇప్పుడు ఉన్న సమస్య కూడా ఇదేనని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్, బీజేపీ పోరు మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల పోరాటం వంటిది


అలాగే కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు గురించి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. గాంధీజీ ముందు చూపు గలవాడని, ఆధునికుడు అని, ఓపెన్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అని చెప్పారు, అలాగే గాడ్సే గతం గురించి మాట్లాడాడని, భవిష్యత్తు గురించి చెప్పలేదని.. ఆ కోపం, ద్వేషంతోనే జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాడని వివరించారు.