Sheikh Mohamed bin Zayed Al Nahyan: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం వారిది. వాళ్ల ఇంట్లో 700 కార్లు ఉన్నాయట. అంతే కాదు వాళ్లు ఉంటున్న ఇంటి ఖరీదు రూ.4,078 కోట్లు ఉంటుందట. ఇవన్నీ చదివి ఇదేదే అనిల్ అంబానీ, అదాని గురించి అనుకుంటే పొరపాటే. ఇదంతా అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌ గురించే. ఈయన గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన కుటుంబం వీరిదేనట.


యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌ రాజకుటుంబం అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో ఆరు శాతం ఈ కుటుంబం అధీనంలోనే ఉన్నాయి. నహ్యాన్ రాజ కుటుంబం ₹4,078 కోట్లు విలువ చేసే అధ్యక్ష భవనంలో ఉంటున్నారు. ఈ కుటుంబానికి ఎనిమిది ప్రైవేట్ జెట్‌లు, ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌ ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతులని జీక్యూ నివేదిక తెలిపింది.
 
జీక్యూ నివేదిక ప్రకారం యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌ కుటుంబం 305 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది. సంపద విలువ అక్షరాలా ఇండియన్ కరెన్సీలో రూ.25,38,667 కోట్లు. ఈ కుటుంబానికి పెద్ద షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌. 18 మంది సోదరులు, 11 మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అల్‌ నహ్యాన్‌ తొమ్మిది మంది సంతానం, 18 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. 


ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో ఆరు శాతం ఈ కుటుంబం అధీనంలోనే ఉన్నాయి. ప్రముఖ గాయకుడు రిహన్నా బ్రాండ్ ఫెంటీ నుంచి ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ X అంతర్జాతీయ ప్రముఖ కంపెనీల్లో ఈ కుటుంబానికి వాటాలున్నాయి. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ వీరి యాజమాన్యంలోనే ఉంది. ఈ కుటుంబం నివసించే భవనాన్ని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. పెంటగాన్‌ వైశాల్యానికి మూడు రెట్లు ఎక్కువ. 94 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని విలువ రూ.4,078 కోట్లు ఉంటుంది. 3,50,000 స్ఫటికాలతో తయారు చేసిన షాన్డిలియర్, విలువైన చారిత్రాత్మక కళాఖండాలు ఉన్నాయి.


అబుదాబీలోని ఖాసర్ అల్‌ వాటన్‌ అధ్యక్ష భవనంలో రాజకుటుంబ సభ్యులు ఉంటున్నారు. యూఏఈలో వారికున్న ఎన్నో భవనాల్లో అతి పెద్దది ఇదే. అమెరికాలోని పలు నగరాలతో పాటు బ్రిటన్‌ రాజధాని లండన్‌, ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అల్‌ నహ్యాన్‌ కుటుంబానికి ఆస్తులున్నాయి. అలాగే ఎస్‌యూవీ, మెర్సిడెస్‌ బెంజ్‌, వంటి లగ్జరీ కార్లు దాదాపు 700 పైచిలుకు, 8 విమానాలు కూడా ఉన్నాయి. 


తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోదరుడు కుటుంబ భాధ్యతలు చూసుకుంటుంటారు. వీరి ఆస్తుల విలువ గత ఐదేళ్లలో దాదాపు 28,000 శాతం పెరిగింది. ప్రస్తుతం $235 బిలియన్ల విలువ కలిగిన వీరి కంపెనీ వ్యవసాయం, ఇంధనం, వినోదం, సముద్ర వ్యాపారాలు చేస్తోంది. దాదాపు పదివేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఓ అంచనా ప్రకారం యూఏఈ రాయల్‌ ఫ్యామిలీ లండన్‌లోని బ్రిటిష్ రాజకుటుంబంతో సరిసమానమైన ఆస్తులు కలిగి ఉంది.


అబుదాబి యునైటెడ్ గ్రూప్ యూకే ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీని ₹2,122 కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్ సిటీ, ముంబై సిటీ, మెల్‌బోర్న్ సిటీ, న్యూయార్క్ సిటీ, ఫుట్‌బాల్ క్లబ్‌లను కూడా నిర్వహిస్తున్న సిటీ ఫుట్‌బాల్ గ్రూప్‌లో 81 శాతం కంపెనీ యాజమాన్యంలో ఉంది.