Israel-Hamas War: 


యూనివర్సిటీపై దాడి..


ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం (Israel Hamas War) మొదలై మూడు నెలలు దాటింది. ఇంకా ఇది ఉద్ధృతంగానే కొనసాగుతోంది. గాజాని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్ దాడులు చేస్తోంది. మధ్యలో ఓ వారం రోజుల పాటు విరామం ఇచ్చి మళ్లీ దాడుల తీవ్రత పెంచింది. అయితే...సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పాలస్తీనాలోని ఓ యూనివర్సిటీని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( Israeli Defense Forces) నేలమట్టం చేసిందంటూ ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యూనివర్సిటీని కూల్చేయడేమంటని మండి పడ్డారు నెటిజన్లు. ఈ వీడియోపై ఇప్పటికే అమెరికా కూడా స్పందించింది. ఇది నిజమా కాదా తేల్చాలని ఇజ్రాయేల్‌ని వివరణ అడిగింది. యూనివర్సిటీ లోపల బాంబులు పెట్టి క్షణాల్లో ధ్వంసం చేసినట్టు ఆరోపిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి చుట్టు పక్కల చాలా సేపటి వరకూ ఆ ప్రకంపనలు వచ్చినట్టు సమాచారం. దీనిపై అమెరికా అధికారికంగా స్పందించకపోయినప్పటికీ ఇజ్రాయేల్‌తో మాత్రం సంప్రదింపులు జరుపుతోంది. సరైన వివరాలు లేకుండా మాట్లాడడం తగదని తేల్చి చెబుతోంది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌ (Khan Yunis) ప్రాంతంలో ఇజ్రాయేల్ సేనలకు, హమాస్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. 






అందుకే దాడి..?


హమాస్‌కి ఈ యూనివర్సిటీయే స్థావరంగా ఉందని గుర్తించి ఇజ్రాయేల్‌ దీనిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. గాజాలోని ఓ హాస్పిటల్ వద్ద భీకర కాల్పులు జరిగాయని, ఆ కాల్పుల్లో 77 మంది ఉగ్రవాదులు చనిపోయారని పాలస్తీనా మీడియా వెల్లడించింది. పదుల సంఖ్యలో ఉగ్రవాదుల్ని ఏరేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయేల్. అందుకే...ఏ మాత్రం వెనకాడకుండా విరుచుకుపడుతోంది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్ దాడులు మొదలు పెట్టింది. ఆ తరవాత ఇజ్రాయేల్‌ కూడా గట్టిగానే ఎదురు దాడులకు దిగింది. ఈ యుద్ధం కారణంగా గాజా నుంచి 20 లక్షల మంది పౌరులు వలస వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు షెల్టర్ హోమ్స్‌లో తల దాచుకుంటున్నారు. వాళ్లకు కనీసం ఆహారం కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లలో కొందరికి వ్యాధులు ప్రబలుతున్నాయని తక్షణమే వైద్య సాయం అందించకపోతే ప్రాణాలకే ప్రమాదమని WHO హెచ్చరించింది. ఈ యుద్ధంలో ఇజ్రాయేల్‌లో 1,140 పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంచనా. 


హమాస్‌ని పూర్తిగా అంతం చేసేంత వరకూ వెనక్కి తగ్గమని ఇప్పటికే ఇజ్రాయేల్ ప్రకటించింది. అయితే..ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాలన్న తొందరలో ఇజ్రాయేల్ ఓ పొరపాటు చేసింది. సొంత దేశానికి చెందిన బందీలనే కాల్చి చంపింది. ముగ్గురు బందీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల వల్ల ఏదో ముప్పు ఉందని అనుమానించి కాల్పులు జరిపింది ఇజ్రాయేల్ సైన్యం. ఆ తరవాత వాళ్లు ముగ్గురూ ఇజ్రాయేల్‌కి చెందిన బందీలే (Israel Hostages Killed) అని గుర్తించి తప్పు తెలుసుకుంది. గాజాలోనే ఉగ్రవాదులపై దాడులు చేసే సమయంలో ఈ పొరపాటు జరిగిందని వివరించింది. ఈ ఘటనపై Israel Defense Forces (IDF) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 


Also Read: భారత్ మాల్దీవ్స్ మధ్య కీలక సమావేశం, విభేదాలు పక్కన పెట్టినట్టేనా?