Ramlala Pran Pratishtha:



అమెరికాలో అయోధ్య వేడుకలు..


అయోధ్య వేడుక కోసం దేశంలోని భక్తులే కాదు NRIలూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. భారతీయుల జనాభా ఎక్కువగా ఉండే అగ్రరాజ్యంలోనూ హిందువులు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటున్నారు. హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా (Hindu University of America) ఆధ్వర్యంలో అక్కడ భారీ ర్యాలీలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల కార్ల ర్యాలీ జరుగుతోంది. దాదాపు వారం రోజులుగా అక్కడ సందడి వాతావరణం కొనసాగుతోంది. టెక్సాస్‌లోని శ్రీ సీతారామ్ ఫౌండేషన్ కూడా హౌస్టన్‌లో శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ వేడుక నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఇది ఎంతో అపురూపమైన రోజు అంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది. 


"వందల ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన అయోధ్య ఇవాళ మళ్లీ ఉద్భవిస్తోంది. సనాతన ధర్మాన్ని నిలబెట్టేందుకు రూపు దిద్దుకుంది. దాదాపు 550 ఏళ్ల తరవాత బాల రాముడికి ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆనందించాల్సిన విషయం ఇది"


- కల్యాణ్ విశ్వనాథన్, అధ్యక్షుడు, హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా 






సాంస్కృతిక కార్యక్రమాలు..


హౌస్టన్‌లో సుందరాకాండ పారాయణం చేయనున్నారు. దీంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ తరవాత శ్రీరామ చంద్రుడికి పట్టాభిషేకం చేసి అందరికీ ప్రసాద వితరణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొంతమంది పాకిస్థానీలూ ఈ వేడుకల్లో పాల్గొంటుండటం విశేషం. అమెరికాలోని దాదాపు వెయ్యి ఆలయాల్లో ఆ రోజున రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి. 20 నగరాల్లో కార్ల ర్యాలీలు చేపట్టనున్నారు. కాలిఫోర్నియాలో దాదాపు 600 కార్లతో ఈ ర్యాలీ జరగనుంది. ఇప్పటికే టెస్లా మ్యూజికల్ నైట్‌ నిర్వహించారు. 






అయోధ్య బాల రాముడి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ తరవాత దర్శనమివ్వాల్సిన రామయ్య ముందే దర్శనమిచ్చాడు. కళ్లకున్న తెరను తొలగించారు. ఆ ఫొటోలే ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే...అసలు ప్రాణ ప్రతిష్ఠ జరగక ముందే ఆ తెరను ఎలా తొలగిస్తారు..? ఆ ఫొటోలు ఎవరు తీశారు..? ఎవరు బయట పెట్టారు అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించడంపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై రామ మందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు కొన్ని నియమాలు పాటించాలని, వాటిని ఉల్లంఘించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.