SJ Suryah: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సూపర్ హీరో సినిమా ‘సరిపోదా శనివారం’. ఇంతకు ముందు నానితోనే ‘అంటే సుందరానికి’ తీసిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా అనుకున్నంత రిజల్ట్ అందించలేకపోయినా వివేక్ ఆత్రేయని, తన కథని నాని నమ్మి మళ్లీ ‘సరిపోదా శనివారం’ అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ‘సరిపోదా శనివారం’ షూటింగ్ కూడా కొన్నాళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పుడు సెట్స్‌లో వెర్సటైల్ స్టార్ యాక్టర్ ఎస్‌జే సూర్య జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఎస్‌జే సూర్య గత కొంతకాలంగా బ్లాక్‌బస్టర్లు అందుకుంటున్నారు. ‘జిగర్తాండా డబుల్ఎక్స్’, ‘మార్క్ ఆంటోని’, ‘డాన్’, ‘మానాడు’ వంటి సినిమాల్లో ఆయన పాత్రలు సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. ఇవి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఏ సినిమాలో ఎస్‌జే సూర్య నటించినా హీరోతో సంబంధం లేకుండా అవి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాయని తమిళనాట మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ వంటి భారీ సినిమాల్లో కూడా ఎస్‌జే సూర్య నటిస్తున్నారు.
ఎస్‌జే సూర్య ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని దర్శకుడిగా ప్రారంభించారు. ‘వాలి’, ‘ఖుషి’ వంటి కల్ట్ సినిమాలకు ఆయనే డైరెక్టర్. కానీ నటన పైన ఉన్న మక్కువతో దర్శకత్వాన్ని పక్కనబెట్టారు. ప్రస్తుతం ఎస్‌జే సూర్యకు నటుడిగా మంచి డిమాండ్ ఉంది. ‘సరిపోదా శనివారం’లో విలన్‌గా నటించడానికి కూడా ఎస్‌జే సూర్య భారీ పారితోషికం డిమాండ్ చేశాడని టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాకు ఆయన రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోనున్నాడని తెలుస్తోంది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరిద్దరూ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’లో జోడిగా కనిపించారు. తెలుగులో ఆమెకు అదే మొదటి సినిమా. ఎస్‌జే సూర్యతో కూడా ప్రియాంకకు ఇది రెండో సినిమానే. శివకార్తికేయన్ హీరోగా, ఎస్‌జే సూర్య ప్రిన్సిపల్‌గా నటించిన‘డాన్’లో కూడా ప్రియాంకనే హీరోయిన్. మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ‘సరిపోదా శనివారం’ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని నాని ఇటీవలే స్వయంగా వెల్లడించారు.‘దసరా’, ‘హాయ్ నాన్న’ సక్సెస్‌ల తర్వాత ‘సరిపోదా శనివారం’తో నాని హ్యాట్రిక్ కొట్టే అవకాశం పుష్కలంగా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా ఐదు భాషల్లో విడుదల చేశారు.