Autism Woman: కుక్కలకు, మనుషులకు మధ్య ఎంతంటి అవినాభావ సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలాది సంవత్సరాల నుంచి శునకాలు మనిషికి చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. ఆనాటి కాలంలో వేటాడటంలో మనిషికి సాయం చేసేవి కుక్కలు. తర్వాత్తర్వాత శునకాలు, మనుషుల మధ్య బంధం బలపడుతూ వచ్చింది. వాటి ప్రతిభకు, అవి చూపించే విశ్వాసాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపోతూనే ఉంటాం. బుక్కెడు బువ్వ పెడితే జీవితాంతం విశ్వాసం చూపిస్తాయి. నమ్మకంగా మన వెంటే ఉంటాయి. కష్ట, నష్టాల్లో కూడా వెన్నంటే ఉండి మద్దతునిస్తాయి. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన శునకాలు ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు సహాయకరంగా ఉంటాయి. పోలీసుల దర్యాప్తుల్లోనూ జాగిలాల ప్రాధాన్యత గురించి తెలిసిందే. తాజాగా ఆటిజంతో బాధపడుతున్న ఓ మహిళకు శునకం చేసిన సహాయం ఇప్పుడు అందరి మన్ననలు అందుకుంటోంది.


తాజాగా స్టాఫోర్ట్ షైర్ బుల్ టెర్రియిర్ జాతికి చెందిన బెల్లె పేరు గల శునకాన్ని యూకేలోని ఓ ఆస్పత్రి లేబర్ వార్డులోకి అనుమతించింది. మహిళల ప్రసవించిన బెడ్ వద్దకు రావడమే కాదు, దానిపై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇలా ఓ కుక్కను లేబర్ వార్డులోకి అనుమతించడం చాలా చాలా అరుదు. యూకేలో ఇలా శునకాన్ని లోపలికి అనుమతించడం ఇదే మొదటిసారి అని నివేదికలు పేర్కొంటున్నాయి. మిల్టన్ కీన్స్ యూనివర్సిటీ హాస్పిటల్ లో ఈ ఘటన జరిగింది. అంతగా ఈ శునకం ఏం చేసింది అనుకుంటున్నారా..


సరుకుల దగ్గరి నుంచి అన్ని పనులు చేసేది..!


అమీ టామ్‌కిన్‌ అనే మహిళ ఆటిజంతో బాధపడుతోంది. తన పని కూడా తనకు చేసుకోలేని పరిస్థితి. ఇల్లు కదల్లేని దుర్భర పరిస్థితిలో బెల్లెనే తనకు సాయం చేసింది. స్టాఫోర్ట్ షైర్ బుల్ టెర్రియిర్ జాతికి చెందిన బెల్లెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఇది తన యజమానులకు అన్ని రకాలుగా సహాయం చేస్తుంది. ఆటిజంతో బాధపడే మహిళ అమీ టామ్‌కిన్‌ కు కూడా బెల్లె అన్ని రకాలుగా సాయం చేసేంది. నిత్యావసర సరకులు కూడా తనే బయటకు వెళ్లి తీసుకువచ్చేది. అమీ ఎప్పుడైనా ఆందోళనకు గురయ్యే ముందే బెల్లె గుర్తించి సాయం చేసేది. లిఫ్ట్ లో వెళ్తుంటే తనే బటన్ నొక్కేది. డెబిట్ కార్డుతో బిల్ పేమెంట్ చేసేదని అమీ తెలిపారు. అలాంటి బెల్లె లేకుండా తను ఉండలేకపోయేదాన్ని అని ఆటిజంతో బాధపడుతున్న అమీ వెల్లడించారు. 


ప్రసవం జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న శునకం


గర్భం దాల్చినప్పటి నుంచి అమీని బెల్లె చాలా జాగ్రత్తగా చూసుకుంది. సరకులు తీసుకురావడంలో, వైద్యుల వద్దకు వెళ్లడంలో మిగతా అన్ని విషయాల్లోనూ బెల్లె సహకారం లేకుండా తాను ఏ పనీ చేయలేకపోయేదాన్ని అని అమీ తెలిపారు. బెల్లె చేసే పనుల గురించి తెలుసుకున్న వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అమీకి, బెల్లెకు ఉన్న అనుబంధాన్ని చూసి లేబర్ వార్డులోకి తనను అనుమతించారు. అమీకి ప్రసవం జరుగుతున్న సమయంలో బెల్లె తన పక్కనే ఉంది. అలా అమీకి తానెప్పుడూ సాయం చేస్తూనే, చేదోడువాదోడుగా ఉంటూనే ఉంది బెల్లె.