Cancer Chemotherapy: క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కీమోథెరపీ చేయించుకోవాలంటే చాలా మంది భయపడిపోతారు. దాని సైడ్‌ ఎఫెక్ట్స్‌ అలా ఉంటాయి. కానీ...అసలు క్యాన్సర్ లేని వాళ్లకి కీమోథెరపీ చేస్తే ఎలా ఉంటుంది..? అమెరికాలోని టెక్సాస్‌లో ఓ 39 ఏళ్ల మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కీమో చేయించుకున్న తరవాత ఆమెకి అసలు క్యాన్సరే లేదని తేలింది. ఇద్దరు పిల్లల తల్లైన ఆ మహిళ 2022లో కడుపు నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లింది. కిడ్నీలో రాళ్లు ఉండడం వల్ల ఈ నొప్పి వస్తుందని వైద్యులు గుర్తించారు. అంతే కాదు. ప్లీహంపైన కండరం పెరిగింది. గతేడాది జనవరిలో సర్జరీ చేసి వాటిని తొలగించారు. ఆ తరవాతే అసలు సమస్య మొదలైంది. ఈ టిష్యూని ల్యాబ్‌కి పంపించి టెస్ట్ చేయగా clear cell angiosarcoma అనే క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని మరో 15 నెలలు మాత్రమే బతికే అవకాశముందని వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పలేదు ఆ మహిళ. వెంటనే కీమో ట్రీట్‌మెంట్ మొదలు పెట్టింది. మొదటి రౌండ్‌లో జుట్టంతా ఊడిపోయింది. ఇలా రౌండ్‌లు పూర్తయ్యే కొద్దీ ఆమె శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. పదేపదే వాంతులు అయ్యేవి. ఎవరి ఇంటికీ వెళ్లేది కాదు. అయితే...ఈ ఏప్రిల్‌లో రొటీన్ చెకప్‌కోసం వెళ్లి టెస్ట్‌లు చేయించుకోగా అసలు ఆమెకి క్యాన్సర్ లేనేలేదని తేలింది. ఈ రిపోర్ట్‌లు చూసి ఆమె షాక్‌ అయ్యింది. 


డాక్టర్ ఈ విషయం చెప్పగానే దాదాపు పావుగంట పాటు ఒంటరిగా కూర్చుంది ఆ మహిళ. ఆ నిజం నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టినట్టు వివరించింది. ఆ రిపోర్ట్‌ తీసుకుని వెంటనే కుటుంబ సభ్యులకు ఈ విషయమంతా చెప్పింది. అయితే...రెండో రౌండ్ కీమోకి ముందే వైద్యులకు ఈ విషయం తెలిసిందని, అయినా తనకు చెప్పలేదని ఆ బాధితురాలు మండి పడుతోంది. ముందే చెప్పి ఉంటే అసలు కీమోకి వెళ్లి ఇంత నరకం అనుభవించేదాన్ని కాదు కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అది కేవలం ఓ బ్లడ్ వెజెల్ అని, అందులో ఎలాంటి క్యాన్సర్ కణాలు యాక్టివ్‌గా లేవని రిపోర్ట్‌లో తేలడం వల్ల ఊపిరి పీల్చుకుంది.