Woman Pilot Saves Over 300 Lives In Delhi: దిల్లీ విమానాశ్రయంలో ఈరోజు ఓ మహిళా పైలట్‌ పెద్ద ప్రమాదం జరగకుండా అడ్డుకోగలిగారు. సుమారు ౩౦౦ మంది ప్రాణాలను ఆమె కాపాడారు. రెండు విమానాలు ఒకే రన్ వేలోకి వస్తున్నాయని అహ్మదాబాద్‌ నుంచి దిల్లీ వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ను అలర్ట్‌ చేయడంతో ఈ ప్రమాదం తప్పింది. మరో విస్తారా విమానానికి కూడా ఇదే రన్‌వేలో టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారని ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. 


బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌ నుంచి దిల్లీ వచ్చిన విస్తారా విమానం దిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానం పార్కింగ్‌ బేకు వెళ్లాల్సిన రన్‌వే లోనే దిల్లీ నుంచి బగ్ డోగ్రాకు వెళ్లాల్సిన మరో విస్తారా విమానానికి ఏటీసీ అనుమతి ఇచ్చింది. అహ్మదాబాద్‌ నుంచి వస్తున్న 45 ఏళ్ల కెప్టెన్‌ సోను గిల్‌ ఇది గమనించారు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు. రెండు విమానాలు క్రాష్‌ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ సమయంలో రెండు విమానాలలో కలిపి ౩౦౦ మంది ప్రయాణికులు ఉన్నారు. 


ఆ సమయంలో రెండు విమానాల మధ్య కేవలం 1.8 కిలోమీటర్లు లేదా 1800 మీటర్ల దూరం మాత్రమే ఉందని సమాచారం. పైలట్‌ ఏటీసీకి వార్నింగ్‌ ఇవ్వకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని భావిస్తున్నారు. 


డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రకారం.. విస్తారా ఫ్లైట్‌ VT1926 రన్‌ వే 29L లో దిగింది. అక్కడి నుంచి పార్కింగ్‌ బేకు వెళ్లే మార్గంలో రన్‌ వే 29R దాటమని ఏటీసీ సూచించింది. అయితే రన్‌ వే 29R నుంచి VT1725 విమానాన్ని టేకాఫ్‌ చేయమని ఏటీసీ తెలిపింది. దీంతో విమానాలు క్రాఫ్‌ అయ్యే ప్రమాదాన్ని పైలట్‌ గుర్తించి హెచ్చరించారు. పైలట్‌ అలర్ట్‌ ఆధారంగా వెంటనే VT1725 విమానం టేకాఫ్‌ను రద్దు చేశారు. అయితే ఈ తప్పిదానికి కారణమైన ఏటీసీ అధికారిని విధుల నుంచి తొలగించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. 


దిల్లీ- బగ్‌డోగ్రా విమానం టేకాఫ్‌ను నిలిపేసిన వెంటనే ఈ విమానం యాక్టివ్‌ రన్‌ వే నుంచి వెనక్కి వెళ్లి దాని పార్కింగ్‌ బేకి తిరిగి వచ్చింది. తర్వాత రెండోసారి టేకాఫ్‌ చేయడానికి, మార్గ మధ్యలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తిరిగి దిల్లీకి రావడానికి   తగిన ఇంధనం ఉందో లేదో సరిచూసుకోవడానికి పైలట్‌ కొంత సమయం తీసుకున్నట్లు తెలిపారు. బగ్‌డోగ్రా వెళ్లే విమానంలో ప్రయాణికులు కాస్త భయాందోళనలకు గురయ్యారు.  ఏటీసీ సూచనలతో టేకాఫ్‌ ఆలస్యమవుతున్నట్లు చెప్పడంతో వారు కంగారు పడినట్లు తెలుస్తోంది.


దిల్లీ విమానాశ్రయంలో ప్రోటోకాల్‌ ప్రకారం విమానం టేకాఫ్‌ లేదా ల్యాండ్‌ అవుతున్నప్పుడు ఎలాంటి వాహనాలు లేదా విమానాల మూవ్‌మెంట్‌కు అనుమతి లేదని సీనియర్‌ పైలట్‌, సేఫ్టీ మేటర్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ అమిత్‌ సింగ్‌ పీటీఐ వార్త సంస్థకు వెల్లడించారు. దగ్గరగా ఉండే రన్‌ వేల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, మెరుగైన పర్యవేక్షణ అవసరమని అన్నారు. పొటెన్షియల్‌ ట్రాఫిక్‌ కొలిజన్స్‌ను నివారించేందుకు మరింత జాగ్రత్త అవసరమని తెలిపారు.