Mizoram Bridge Fall : మిజోరం లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో దాదాపు 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. రాజధాని నగరం ఐజ్వాల్‌కు 21కి.మీ దూరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది, నిర్మాణ పనులు జరుగుతోన్న సమయంలో ఈ వంతెన కూలింది. ప్రమాద సమయంలో అక్కడ 35 నుంచి 40 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. వారిలో కొంతమంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. ఈ ఘటనపై మిజోరం ముఖ్యమంత్రి జొరామ్‌థంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఐజ్వాల్ సమీపంలోని సైరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రమాద స్థలంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ప్రమాదం జరిగినప్పుడు సుమారు 40 మంది కూలీలు అక్కడే ఉన్నారు. కురుంగ్ నదిపై బైరాబీని సారంగ్ తో కలిపే రైల్వే వంతెన నిర్మాణంలో ఉంది. ప్రమాద స్థలం ఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రైల్వే బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఉపరాష్ట్రపతి ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తక్షణం సహాయ చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా..కేంద్ర బృందాలను రంగంలోకి దింపామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు.