మధ్యతరగతి ప్రజలు తక్కువ ఖర్చులో సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. అందుకే, ఎక్కువ  దూరం ప్రయాణించేందుకు రైలు ప్రయాణమే బెస్ట్ అనుకుంటారు. అయితే, రైళ్లలో కొందరు వ్యక్తులు చేసే పనులు  తోటి ప్రయాణీకులకు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. వాళ్లు చేసే పిచ్చి చేష్టల మూలంగా ప్రాణాలుపోయే పరిస్థితి ఎదురవుతుంది. ఫుట్ బోర్డు ప్రయాణం చేయడం, రైలు కిటికీలు పట్టుకుని వేలాడటం, డోర్ దగ్గర పట్టుకుని రకరకాల ఫీట్లు చేయడం మనం తరచుగా గమనిస్తుంటాం. కొంత మంది రన్నింగ్ ట్రైన్ బోగీల మీదకు ఎక్కడం చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటనే బంగ్లాదేశ్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


వాస్తవానికి బంగ్లాదేశ్ రైళ్లలో ఎప్పుడు చూసినా రద్దీ విపరీతంగా ఉంటుంది. రైలు ఎక్కేందుకు అక్కడి ప్రయాణీకులు నిత్యం కుస్తీలు పడుతుంటారు. ఒకరినొకరు తోసుకుంటారు. బంగ్లా రైల్వేకు సంబంధించిన పలు వీడియోలు  నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. రైల్లో ఇసుకేస్తే రాలనంత మంది జనాలు ఉండటంతో ఫుట్ బోర్డు మీదే ప్రయాణం చేస్తుంటారు చాలా మంది. మరికొంత మంది రైలు బోగీల మీదికి ఎక్కి ప్రయాణం చేస్తుంటారు.


తాజాగా రైలులో సీట్లు దొరకకపోవడంతో ఓ మహిళ కిటికి మీద కాలు పెట్టి బోగీ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైల్లో అప్పటికే నిండుగా జనాలు ఉండటంతో కొంత మంది బోగీల మీద ఎక్కి కూర్చున్నారు. రైలు లోపల ప్రయాణించడం కష్టం అనుకున్న ఆ మహిళ పైకెక్కి ప్రయాణించాలనుకుంది. కిటికీ మీద కాలు పెట్టి పైకి వెళ్లేందుకు ప్రయత్నించింది. పైనున్న కొందరు ఆమెను పైకి లాగేందుకు సాయం చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆమె చేతిని పట్టుకుని వారు పైకి లాగుతున్నా.. ఆమె ఎక్కలేకపోయింది. అదే సమయంలో ఓ పోలీసు అక్కడికి  చేరుకున్నాడు. పైకి ఎక్కకూడదని హెచ్చరించాడు. దీంతో ఆ మహిళ రైలు దిగి పక్కకు వెళ్లిపోయింది.


అదే స్టేషన్ లో రైలు ఎక్కేందుకు వచ్చిన ఓ ప్రయాణీకుడు.. మహిళ రైలు బోగీ ఎక్కేందుకు ప్రయత్నించడాన్ని గమనించాడు. వెంటనే ఈ తతంగాన్ని ఆయన సెల్ ఫోన్ లో బంధించాడు. ఆ తర్వాత తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఇప్పటికే లక్షల వ్యూస్ వచ్చాయి. జనాలు ఈ వీడియోను వరుసబెట్టి షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  కొంచెం కష్టపడి ఉంటే రైలు పైకి ఎక్కేవారని ఒకరు కామెంట్ చేయగా.. ఇలాంటి సాహసాలే వద్దని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. పాపం సదరు పోలీసు రాకపోయి ఉంటే హాయిగా రైలు పైకి ఎక్కేది కదా అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. అటు  రైల్వే అధికారులు మాత్రం ప్రమాదకరమైన ప్రయాణం వద్దు అని ప్రయాణీకులకు సూచిస్తున్నారు. ప్రాణాలు అత్యంత ముఖ్యమైనవి అని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు.


Also Read: ఈ హోటల్ కేవలం పందులకే - ఫుల్ సెక్యూరిటీ, వైద్యుల పర్యవేక్షణతో లగ్జరీ లైఫ్!


Also Read: కొండచిలువను మింగేసిన పాము, దీని ఎక్స్‌రే చూస్తే షాకవుతారు