కళ్లు చెదిరే బహుళ అంతస్తుల భవనాలు, చుట్టూ హై సెక్యూరిటీ కెమెరాలు. బయటి వ్యక్తులు లోపలికి వెళ్లకుండా కఠిన చర్యలు. ఇవేవో దేశ భద్రతకు సంబంధించిన బిల్డింగులు కాదు. పందుల పెంపకం కోసం చైనాలో ఏర్పాటు చేసిన భవనాలు. వింటుంటేనే కాస్త ఆశ్చర్యం కలిగినా.. ఇది ముమ్మాటికీ వాస్తవం. పందులు తినే ఆహార పరిశీలన మొదలుకొని.. అవి రోగాల బారిన పడకుండా ఉండేందుకు 24 గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది ఇక్కడ.
ప్రపంచంలోనే అతిపెద్ద పందుల పెంపక కేంద్రం
చైనాలోని సర్కారు నిర్ణయంతో పందుల కోసం ప్రత్యేకంగా హోటళ్లను ఏర్పాటు చేస్తున్నారు. తొలుత తక్కువ అంతస్థుల్లో పందుల పెంపకం మొదలు పెట్టిన చైనా సర్కారు.. ప్రస్తుతం వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. దక్షిణ చైనాలో 13 అంతస్తులు ఉండే ఓ హోటల్ ను దాదాపు 10 వేల పందులు ఉండేలా సకల సౌకర్యాలతో నిర్మించారు. అటు బీజింగ్ సమీపంలోని పింగూలో మరో భారీ భవంతిని నిర్మించారు. ఏడాదికి సుమారు లక్షన్నర పందుల ఉత్పత్తే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఈ పందుల హోటళ్ల నిర్మాణంలో ముయాన్ ఫుడ్స్, న్యూహోప్ గ్రూప్ సహా పలు కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయి. ఈ నెలాఖరులోగా.. హుబేలో ప్రైవేట్ యాజమాన్యంలోని సంస్థ అయిన Zhongxin Kaiwei మోడరన్ ఫార్మింగ్, 26-అంతస్తుల పిగ్ హోటల్‌ను పూర్తి కాబోతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పందుల పెంపక నిర్మాణంగా రికార్డులు చెబుతున్నాయ్. ఇందులో సంవత్సరానికి 54,000 టన్నుల పంది మాంసం ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బయో సెక్యూరిటీ జోన్లలో పందుల పెంపకం
చైనా ప్రజలు రోజువారీ ఆహారంలో ఎక్కువగా పంది మాంసమే ఉంటుంది. అయితే 2018లో అక్కడ ఆఫ్రికా స్వైన్ ఫ్లూ విజృంభించింది. దీని కారణంగా సుమారు 40 కోట్ల పందులు చనిపోయాయి. దేశంలోని మొత్తం పందుల్లో సగానికి పైగా మృత్యువాత పడటంతో పంది మాంసం కొరత విపరీతంగా ఏర్పడింది. రేటు భారీగా పెరిగింది. దేశీయంగా అవసరాలను తీర్చుకునేందుకు చైనా భారీగా దిగుమతులను పెంచింది. ఈ కారణంగా అక్కడ భారీగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చైనా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పందుల మీద వైరస్ ఎఫెక్ట్ లేకుండా చూడటంతో పాటు వాటి ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బయో సెక్యూరిటీ జోన్లలో పందుల పెంపకానికి ఓకే చెప్పింది. అలా ఈ పిగ్స్ హోటళ్లు రూపొందుతున్నాయి.
నిరంతరం నిపుణుల పర్యవేక్షణ
ఈ హోటళ్లలో పందులు చాలా సురక్షిత వాతావరణంలో పెరుగుతాయి. బయటి నుంచి ఎలాంటి హానికర సూక్ష్మక్రియులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు పరీక్షించిన దాణాను మాత్రమే వీటికి అందిస్తారు. ఇందులో పని చేసే సిబ్బంది సైతం ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. పందులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. సాంప్రదాయ పందుల పెంపకంతో పోల్చితే.. తక్కువ విస్తీర్ణంలో అత్యంత అనుకూల వాతావరణం ఇవి పెరుగుతాయి. పర్యవరణ వనరుల వినియోగం సైతం చాలా తగ్గుతుంది. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పిగ్ హోటళ్లలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందితే భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఒకవేళ అదే జరిగితే నియంత్రించడం చాలా కష్టమంటున్నారు.
Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!