Mamata Banerjee on BSF:
ఈస్టర్న్ జోన్ కౌన్సిల్‌లో...
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో కీలక సమావేశం జరిగింది. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అంతర్గత, సరిహద్దు భద్రతపై ఈ సందర్భంగా చర్చించారు అమిత్‌షా. ఈ సమయంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిహద్దు భద్రతా బలగాలు (BSF)తో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి BSF సరిగా సహకరించడం లేదని ఆమె తీవ్రంగా ఆరోపించారు. కొన్ని చోట్ల మాత్రమే బలగాలు యాక్టివ్‌గా ఉంటున్నాయని, మరి కొన్ని చోట్ల అసలు నిఘా పెట్టడం లేదని విమర్శించారు. అంతే కాదు. ప్రభుత్వ పనుల్లోనూ జోక్యం చేసుకుంటోందని మండి పడ్డారు. అమిత్‌షా సమక్షంలోనే ఇలా విమర్శలు చేశారు మమతా బెనర్జీ. బీఎస్‌ఎఫ్ నిఘా పరిధినీ 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకే ఇలా చేశారని ఆరోపించారు. ఈ కారణంగా...బీఎస్‌ఎఫ్‌కు అదనపు అధికారాలు కట్టబెట్టినట్టైందని అన్నారు. నిజానికి...ఈ అంశంపై చాన్నాళ్లుగా మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్‌ఎఫ్ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ
గతేడాది అసెంబ్లీలో ఓ తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు. పంజాబ్ కూడా ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశ పెట్టింది. ఆ తరవాత బెంగాల్ అదే బాటలో నడిచింది. ఇక్కడే చర్చకు వస్తున్న మరో అంశం...కేంద్ర హోం శాఖ బీఎస్‌ఎఫ్ నియమ నిబంధనల్ని మార్చివేయడం. ఈ మార్పులు జరిగిన వెంటనే ఆ బలగాలకు అదనపు అధికారాలు వచ్చాయి. అంతకు ముందు రాష్ట్ర సరిహద్దు లోపల 15 కిలోమీటర్ల వరకూ వారెంట్ లేకుండానే చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిధిని 50 కిలోమీటర్లకు పెంచారు. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అసోం, మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది అమల్లోకి వచ్చింది. అయితే...పంజాబ్, బెంగాల్‌లో మాత్రమే దీనిపై వ్యతిరేకత వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో లేదు.
ఇదీ కారణం...
రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని అణిచివేస్తున్నారంటూ కేంద్రంపై మమతా ఫైర్ అవుతున్నారు. ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా బీఎస్‌ఎఫ్ పరిధిని ఎలా పెంచుతారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే..బీజేపీ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతా బలగాలకు ఒకే రకమైన అధికారాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తోంది. సరిహద్దుల్లో ఎలాంటి అలజడులు రేగకుండా, రాష్ట్ర భద్రతకు భరోసా ఇచ్చేందుకు ఇది అవసరమని వివరిస్తోంది. మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేయడానికీ కారణముంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బీఎస్‌ఎఫ్ కూడా వచ్చి జోక్యం చేసుకుంటోంది. కానీ...కొన్ని సార్లు స్థానిక పోలీసుల పరిధిలో ఉండే సమస్యల్నీ తలకెత్తుకుంటున్నారని ఆరోపిస్తున్నారు మమతా. ఫలితంగా...భద్రతా బలగాలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోందని.. వాళ్ల మధ్య సయోధ్య ఉండటం లేదని చెబుతున్నారు. అందుకే...అమిత్‌షాతో జరిగిన సమావేశంలో మరోసారి తన నిరసన గళాన్ని వినిపించారు దీదీ.
Also Read: AAP National Council Meeting: 2024 ఎన్నికలకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్న ఆప్, టార్గెట్ అదే!