IPL 2025 GT 6th Victory: ఈ సీజ‌న్ లో టేబుల్ టాప‌ర్ గుజ‌రాత్ టైటాన్స్ స‌త్తా చాటుతోంది. వ‌రుస‌గా రెండో విజ‌యంతో ఓవ‌రాల్ గా ఆరో విక్ట‌రీని త‌న ఖాతాలో వేసుకుంది. సోమ‌వారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ఆతిథ్య కేకేఆర్ పై 39 ప‌రుగుల‌తో జీటీ విజ‌యం సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెన‌ర్ శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (55 బంతుల్లో 90, 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో స‌త్తా చాటాడు. చివ‌ర్లో వేగంగా ఆడే క్ర‌మంలో త్రుటిలో సెంచ‌రీని కోల్పోయాడు. అనంత‌రం ఛేద‌న‌లో ఓవ‌ర్ల‌న్నీ ఆడిన కేకేఆర్ 8 వికెట్ల‌కు 159 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 50, 5 ఫోర్లు, 1 సిక్సర్) తో పోరాటం చేశాడు. బౌలర్లలో రషీద్, ప్రసిధ్ క్రిష్ణకు రెండేసి వికెట్లు దక్కాయి. 

సూప‌ర్ భాగ‌స్వామ్యం.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ కు మ‌రో ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (36 బంతుల్లో 52, 6 ఫోర్లు, 1 సిక్స‌ర్) తో క‌లిసి గిల్‌ చ‌క్క‌ని భాగ‌స్వామ్యం అందించాడు. వీరిద్ద‌రూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడ‌టంతో స్కోరు బోర్డు ప‌రుగులెత్తింది. బౌండ‌రీల‌తోనే ఎక్కువ డీల్ చేశారు. దీంతో ఫ‌స్ట్ గిల్ 34 బంతుల్లో ఫిఫ్టీ చేయ‌గా, త‌ర్వాత సుద‌ర్శ‌న్ 33 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఈక్ర‌మంలో టోర్నీలో హ‌య్యెస్ట్ స్కోర‌ర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ ను సుద‌ర్శ‌న్ ద‌క్కించుకున్నాడు. ఆ త‌ర్వాత కాసేప‌టికే త‌ను ఔట‌వ‌డంతో 114 ప‌రుగుల పార్ట్న‌ర్ షిప్ కు  తెర ప‌డింది. వ‌న్ డౌన్ లో జోస్ బ‌ట్ల‌ర్ (23 బంతుల్లో 41, 8 ఫోర్లు) బ్యాట్ కు పని చెప్ప‌డంతో తుఫాన్ వేగంతో ప‌రుగులు వచ్చాయి. మ‌రో ఎండ్ లో గిల్ కూడా వేగంగానే ప‌రుగులు సాధించాడు. అయితే నాలుగు బంతుల తేడాతో వీరిద్ద‌రూ ఔట్ కావ‌డంతో పాటు మిడిలార్డర్ విఫ‌లం కావ‌డంతో 200 ప‌రుగుల మార్కును గుజ‌రాత్ దాటలేక పోయింది. మిగ‌తా బౌల‌ర్లలో వైభ‌వ్ అరోరా, హ‌ర్షిత్ రాణా, అండ్రీ ర‌సెల్ కు త‌లో వికెట్ ద‌క్కింది. 

చ‌ప్ప‌గా ఛేద‌న‌..ఓవ‌ర్ కు దాదాపు ప‌ది ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ కు శుభారంభం ద‌క్క‌లేదు. న‌యా ఓపెన‌ర్ ర‌హ్మానుల్లా గుర్భాజ్ (1) విఫ‌ల‌మ‌య్యాడు. సునీల్ న‌రైన్ (17) వేగంగా ఆడే ప్ర‌య‌త్నం చేయ‌గా, వెంక‌టేశ్ అయ్య‌ర్ (14) స్లో బ్యాటింగ్ తో విసిగించి, ఔట‌య్యాడు. మ‌రో ఎండ్ లో ర‌హానే మాత్రం వేగంగా ఆడుతూ బౌండ‌రీలు సాధించాడు. ఈ క్ర‌మంలో 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు లీగ్ లో 500 బౌండరీల మార్కును దాటాడు. ఆ తర్వాత బారీ షాట్ ఆడే క్ర‌మంలో రహానే స్టంపౌట్ అయ్యాడు.  ఆ త‌ర్వాత ఆండ్రీ ర‌సెల్ (21) మూడు ఫోర్లు, ఒక సిక్స‌ర్ తో గెలుపుపై ఆశ‌లు రేపినా, త‌ను ఔట్ కావ‌డంతో కేకేఆర్ విజ‌యంపై ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. ఓ ఎండ్ లో రింకూ సింగ్ (17) ఉన్నా, ర‌మ‌ణ్ దీప్ సింగ్ (1), మొయిన్ అలీ డ‌కౌట్ గా వెనుదిర‌గ‌డంతో కేకేఆర్ ఛేజింగ్ లో చాలా వెనుక‌బ‌డింది. ఆఖ‌ర్లో అంగ్ క్రిష్ ర‌ఘువంశీ ( 27 నాటౌట్) తో క‌లిసి రింకూ జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌య‌త్నం చేశాడు. దీంతో జట్టు 39 పరుగుల దూరంలో నిలిచి పోయింది.  ఇక ఈ ఫ‌లితంతో సీజ‌న్ లో ఐదో ప‌రాజ‌యాన్ని కేకేఆర్ మూట‌గ‌ట్టుకుంది.