AAP National Council Meeting:
కీలక సమావేశం..
గుజరాత్ ఎన్నికల ఫలితాలతో జాతీయ పార్టీగా అవతరించింది ఆమ్‌ఆద్మీ. ఆ రాష్ట్రంలో 5 సీట్లకే పరిమితమైనప్పటికీ...ఓటు శాతాన్ని మాత్రం ఆశించిన స్థాయిలోనే రాబట్టుకోగలిగింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనుకున్న ఎన్నికల పోటీని...బీజేపీ వర్సెస్ ఆప్ అని చర్చించుకునేలా చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటోంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలి..? వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఎలా సిద్ధమవాలి..? అనే అంశాలపై మేధోమథనం చేయనుంది. "టార్గెట్ 2024" ఎజెండాతో ముందుకు సాగనుంది. పది మంది రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇటీవలే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల బీజేపీ అధికారానికి స్వస్తి పలికి... అధికారంలోకి వచ్చింది ఆప్. ఇది కూడా ఆ పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. పంజాబ్‌లోనూ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ వరుస ఎన్నికల తరవాత నిర్వహించుకుంటున్న కీలక సమావేశమిది. అందుకే...పార్టీ నేతలందరూ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్‌తో సహా కీలక నేతలందరూ ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఆయా రాష్ట్రాల రాజకీయ వాతావరణం ఎలా ఉందన్న అంశంపైనా చర్చించనున్నారు. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపైనా ప్రత్యేక దృష్టి సారించనుంది ఆప్. పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న సందీప్ పఠక్‌ను ఇటీవలే నేషనల్ సెక్రటరీగా నియమించారు కేజ్రీవాల్. ఆయన నేతృత్వంలోనే కీలక సమావేశాలన్నీ జరగనున్నాయి.
ఆత్మవిశ్వాసం..
"మాకు గుజరాత్‌లో 15-20% ఓట్లు వచ్చినా అది మా విజయంగానే భావిస్తాం. బీజేపీ కంచుకోటలో ఆ మాత్రం ఓట్లు రాబట్టుకోగలిగాం అంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నట్టే కదా. ఎప్పటికైనా బీజేపీకి ప్రత్యామ్నాయం ఆప్ మాత్రమే" అని బల్లగుద్ది చెబుతున్నారు కేజ్రీవాల్. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం...ఆప్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేసింది. గుజరాత్‌లో కేజ్రీవాల్ ప్రచారం చాలా అగ్రెసివ్‌గా సాగింది. 20కిపైగా ర్యాలీలు చేపట్టారాయన. గతంలో ఎప్పుడూ లేనంతగా..హిందుత్వ ఓటు బ్యాంకుకీ ఎర వేశారు. ఆ వర్గాన్ని ఆకట్టుకునే వ్యాఖ్యలూ చేశారు. కేజ్రీవాల్ వర్సెస్ మోడీ అనే తన పొలిటికల్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఢిల్లీలో గెలవడం వల్ల ఆప్ మైలేజ్ ఇంకా పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో సరైన రీతిలో అభివృద్ధి జరిగితే "ఢిల్లీ మోడల్" అనే ప్రచారాస్త్రాన్ని ప్రయోగించేందుకూ వీలవుతుంది. అది సక్సెస్ అయ్యే అవకాశమూ ఉంటుంది. "మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్" వర్సెస్" నినాద ప్రభావం ఢిల్లీలో కనిపించలేదని తేల్చి చెబుతోంది ఆప్. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ కోసం రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకుంటోంది. మొత్తంగా...ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈ విజయం బూస్ట్ లాంటిదే.
Also Read: Iran Hijab Protest: ఆస్కార్ విన్నింగ్ నటిని అరెస్ట్ చేసిన ఇరాన్, ఆ పోస్ట్‌తో ఆగ్రహం