Iran Hijab Protest:


తరానే అలిదూస్తి అరెస్ట్...


ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 3 నెలలుగా రోడ్లపైకి వచ్చి మహిళలు నిరసనలు చేపడు తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం వందలాది మందిని అరెస్ట్ చేసిన జైల్లో పెట్టినా...ఉద్యమం ఆగడం లేదు. ఈ క్రమంలోనే హిజాబ్ నిరసనకారులకు మద్దతు తెలిపిన ప్రముఖ నటిని అరెస్ట్ చేశారు పోలీసులు. 2016లో "The Salesman"
సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్న తరానే అలిదూస్తి (38)ని అరెస్ట్ చేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారనే కారణం చూపించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 8న ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఇరాన్ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. నిరసనకారుల్లో భయాన్ని పెంచేందుకు ఆ రోజే ఓ 23 ఏళ్ల యువకుడిని ఉరి తీసింది ప్రభుత్వం. "మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం...ఈ అణిచివేతకు మద్దతు  తెలుపుతున్నారని" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు తరానే. అంతే కాదు. అంతర్జాతీయ సంస్థలపైనా మండి పడ్డారు. "ఇరాన్‌లో ఏం జరుగుతోందో చూసి కూడా అంతర్జాతీయ సంస్థలు స్పందించడం లేదంటే...ఇది మానవత్వానికి అతి పెద్ద మచ్చ" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ కారణంగానే...ఆమె అరెస్ట్ అయ్యారు. తరానే అలిదూస్తి (Taraneh Alidoosti) టీనేజ్‌ నుంచి ఇరాన్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన   "Leila's Brothers" సినిమాను ఈ ఏడాది జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 16న మహసా అమిని అనే ఓ 22 ఏళ్ల యువతి హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టగా...ఆమెను మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె మృతి చెందింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 






కఠిన చర్యలు..


ప్రభుత్వం ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏం చేసైనా సరే...వారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే...23 ఏళ్ల యువకుడు మోసిన్ షెకారీని ఉరి తీసింది ప్రభుత్వం. ఇరాన్ పత్రిక్ మిజాన్ ఈ విషయం వెల్లడించింది. టెహ్రాన్‌లోని ఓ రోడ్‌ని బ్లాక్ చేసి...భద్రతా బలగాలపై దాడి చేశాడని, అందుకే ఉరి తీశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటి వరకూ ఈ నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు చేసినప్పటికీ..ఇలా ఉరి తీయలేదు. అనధికారికంగా కొందరిని కాల్చి చంపారు. కానీ...ప్రభుత్వమే అధికారికంగా ఇలా "ఉరి తీయడం" ఆందోళనకారుల్లో భయాన్ని పెంచుతోంది. "ఎలాంటి అల్లర్లు సృష్టించకండి" అని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఇప్పుడీ ఉరితో ఆ హెచ్చరికల తీవ్రతను పెంచినట్టైంది. ప్రభుత్వ హెచ్చరికల్ని కాదని రోడ్లపై ఇలా నిరసనలు చేపడితే...ఇలాంటి శిక్షే పడుతుందని తేల్చి చెప్పింది. ఈ యువకుడు సైనికుడిని చంపినట్టు ఆధారాలున్నాయని, అందుకే ఉరి తీశామని స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలపై ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుపుతున్నాయి. ముఖం, ఛాతి, జననాంగాలను లక్ష్యంగా చేసుకుని ఫైరింగ్ చేస్తున్నట్టు వైద్యులు షాకింగ్ విషయాలు వెల్లడించారు.


Also Read: Iran Protesters Jailed: నిరసనలు చేసినందుకు 400 మందికి జైలు శిక్ష