Iran Protesters Jailed: ఇరాన్‌లో విధించే శిక్షలు ఎప్పుడు సంచలనంగా నిలుస్తాయి. తాజాగా ఆందోళనల్లో పాల్గొన్నారని 400 మందికి జైలు శిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇటీవల దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనల్లో పాల్లొన్న 400 మందికి జైలు శిక్ష విధించారు.


ఇలా


హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న వారిలో ఇప్పటివరకు 400 మందికి జైలు శిక్ష విధించినట్లు తెహ్రాన్ ప్రావిన్స్ జ్యుడిషియరి చీఫ్ అలీ అల్ఘసి-మెహర్ తెలిపారు. ఇందులో 160 మందికి ఐదు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష, 80 మందికి రెండు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, 160 మందికి రెండేళ్లలోపు జైలు శిక్ష విధించినట్టు తెలుస్తోంది.


మరణశిక్ష


మొత్తం జైలు శిక్షలు విధించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ఆందోళనల కారణంగా దాదాపు 14000 మందికి పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తెలిపింది. ఇప్పటివరకు ఇద్దరికి మరణ శిక్ష అమలు చేశారు. మరో 9 మంది మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని అనడోలు అనే సంస్థ పేర్కొంది.


తాజాగా సోమవారం మరో వ్యక్తిని ఉరి తీశారు. దేశ సంప్రదాయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొని, అతను ఇద్దరు భద్రత సిబ్బందిని పొడిచి హత్యకు పాల్పడినట్టు అతనిపై అభియోగాలు రావడంతో ఈ శిక్ష విధించారు .ఇది మొహ్సేన్ శేకరి మరణ శిక్ష తర్వాత రెండవది.


మతం పేరిట దశాబ్దాలుగా అనుభవిస్తున్న అణచివేత, నిర్భంధాలకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం దాదాపు 300 మంది ఈ ఆందోళనల్లో మృతి చెందారు. వారిలో 40 మంది వరకు చిన్నారులు ఉన్నారు.


Also Read: Russia Flu Outbreak: బంకర్‌లో దాక్కున్న రష్యా అధ్యక్షుడు పుతిన్!