భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు సీఎంల మార్పు సీజన్ నడుస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీనే అలా సీఎంలను మారుస్తుందన్న ప్రచారం ఉంది. బీజేపీ ఆరేళ్ల పాలనలో మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది కానీ సీఎంలను మార్చింది లేదు. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి మారిపోయింది. అత్యధిక రాష్ట్రాల్లో సీఎంలను మార్చేస్తోంది. అయితే పార్టీలో అంతర్గతంగా కానీ బహిరంగంగా కానీ అసంతృప్తి అనేది లేకుండా సీఎంలను మార్చేస్తున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా మారుస్తున్న సీఎంలను అయినా గొప్ప ప్రజాదరణ ఉన్న వారిని పెడుతున్నారా అంటే అదీ లేదు. పెద్దగా ప్రజాబలం లేని తెచ్చుకోలేని నేతల్నే ఏరికోరి తెచ్చి సీఎంలను చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు..?. బీజేపీలో తాము తప్ప ఇతరులు ఎవరూ ఎదగకూడదని అనుకుంటున్నారా..? 


సీనియర్లు, దిగ్గజాలు సైడ్, ఇప్పుడు అంతా మోడీ, షా హవా !


2014 ఎన్నికలకు ముందు అమిత్ షా గురించి ఎంత మందికి తెలుసు..? మహా అయితే గుజరాత్‌లోనే ఆయన ఫేమస్. సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో మరో విధంగా ఆయన పేరు ప్రాచుర్యం పొందింది. కానీ ఇప్పుడు ఆయన బీజేపీలో తిరుగులేని నేత. ఓ రకంగా చెప్పాలంటే మోడీ కంటే ఆయనే పవర్ ఫుల్ అని బీజేపీలోని కొంత మంది చెప్పే మాట. 2014 సమయంలో బీజేపీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు..? బీజేపీలోనే ఉన్నారు. కానీ కనీసం వారికి పార్టీలో రోజువారీ వ్యవహారాలపైనా సమాచారం ఉండదు. ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒకప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లోనూ కిందా మీదా పడుతున్నప్పుడు రాజ్ నాథ్ పార్టీని శాసించారు. కానీ ఇప్పుడు ఆయనకు పార్టీలో కనీస ప్రాధాన్యం లేదు. అదే పరిస్థితి నితిన్ గడ్కరీకి ఉంది. ఆయన కూడా బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. ఆయనకు ఆరెస్సెస్ లాంటి బలమైన సపోర్ట్ ఉన్నప్పటికీ పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో సీనియర్లుగా కేంద్రమంత్రి పదవులు మాత్రం వారికి దక్కాయి. నిర్ణయాలైనా స్వతంత్రంగా తీసుకంటున్నారో లేదో చెప్పడం కష్టం.


Also Read : దావూద్‌కి బ్రదర్స్‌, కసబ్‌కి కజిన్స్‌ లాంటి వాళ్లు.. వీళ్లు మామూలోళ్లు కాదు!


ప్రజాబలం లేని నేతల్ని అందలం ఎక్కిస్తున్న మోడీ , షా ! 


ఇక దిగ్గత నేతలుగా పేరు పడిన వారందర్నీ మోడీ, షా పార్టీని తమ చేతుల్లోకి తీసుకున్న తొలి నాళ్లలోనే నాన్ ప్లేయింగ్ కెప్టెన్ల జాబితాలోకి చేర్చి.. పెవిలియన్‌లో కూర్చోబెట్టేశారు. వాళ్ల వాయిస్ ఎవరికీ వినబడకుండా చేశారు. ఇలాంటి వారిలో అగ్రగణ్యులు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి. వాళ్ల వయసు అయిపోవడం కూడా కలసి వచ్చింది. ఇక పార్టీలో బలమైన వాయిస్.. సీనియర్ అనుకున్న వెంకయ్యనాయుడ్ని కూడా అంతే వ్యూహాత్మకంగా ఉపరాష్ట్రపతిని చేసి పక్కన పెట్టేశారు. ఉమాభారతి లాంటి వారి పరిస్థితి అంతే. సీనియర్లను సైలెంట్ చేసి.. దిగ్గజాలను పెవిలియన్‌కు చేర్చేసి బీజేపీలో తిరుగులేని నేతలుగా మారారు మోడీ.షా. అంతటితో ఆగిపోలేదు..ఏ రాష్ట్రంలోనూ తమతో సరి తూగే నేత ఎదగకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యమంత్రులుగా డమ్మీల్ని పెట్టేసి.. పరోక్ష పాలన చేస్తున్నారు.


Also Read : పొరపాటున అకౌంట్‌లో రూ. ఐదున్నర లక్షల జమ ! మోడీ వేశారని వాడేసుకున్న వ్యక్తి !


ప్రజాబలం ఉన్న వారిని ఎందుకు ప్రోత్సహించడం లేదు ? నితిన్ పటేల్ కన్నీళ్లకు కారణం ఏమిటి? 


బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బలమైన సీఎం .. మోడీ, షాలను అయినా ప్రశ్నించగలిగే సీఎం.. కనీసం అంతర్గత సమావేశాల్లో అయినా ప్రశ్నించగలిగిన సీఎం ఒక్కరైనా ఉన్నారా .. లేనే లేరు. పోనీ కనీసం మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కారణంగా సీఎం అయిన వారు ఉన్నారా.. లేనే లేరు. ఉన్న వారంతా హైకమాండ్ అంటే మోడీ, షా చాయిసే. అందుకే చాలా సులువుగా ముఖ్యమంత్రుల్ని మార్చేస్తున్నారు. చివరికి ఒకప్పుడు సీఎం పదవికి రాజీనామా చేయించారని సొంత పార్టీ పెట్టుకున్న యడ్యూరప్ప ఇప్పుడు సైలెంట్‌గా పదవి నుంచి దిగిపోయారు. కానీ అక్కడ సీఎంగా ఎంపిక చేసిన బొమ్మై ..బొమ్మ అనే విశ్లేషణలు మొదటి రోజు నుండే వచ్చాయి. ఎందుకంటే ఆయన ప్రజా నేత కాదు. ఇక మోడీ, షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో నితిన్ పటేల్ అనే బలమైన నేత ఉండగా తొలి సారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌ను సీఎంగా ఎంపిక చేశారు. దీంతో నితిన్ పటేల్ కళ్ల నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకు మైనస్.. ఆయనకు సీఎం పదవి ఇస్తే పేరు తెచ్చుకునే టాలెంట్ ఉండటమే.


Also Read : దిల్లీలో బాణసంచా అమ్మకాలు, స్టోరేజీపై బ్యాన్


బీజేపీ మరో కాంగ్రెస్ అవుతోందా ? 


దీన్ని బట్టి చూస్తే నరేంద్రమోడీ, అమిత్ షాలు సొంత పార్టీలో ఇతర నేతలెవర్నీ ఎదుగకుండా ముఖ్యమైన పదవుల్లో వీలైనంత వరకూ బలహీన నేతల్నే పెడుతున్నారు. బలమైన నేతల్ని నియంత్రించేస్తున్నారు. ఈ కారణంగా బీజేపీలో ఇప్పుడు ఎవరికైనా మోడీ, షాలే కనిపిస్తున్నారు. బీజేపీ అంటే మోడీ, షా..  మోడీ , షా అంటే బీజేపీ. ఒకప్పుడు ఇందిరా అంటే కాంగ్రెస్ .. కాంగ్రెస్ అంటే ఇందిరా అన్న ప్రచారం కాంగ్రెస్‌లో జరిగింది. ఇప్పుడా పరిస్థితి బీజేపీలో వచ్చింది. అది ఓ రకంగా బీజేపీని కాంగ్రెస్ మార్గంలోకి అంటే అంతర్గ గొడవల్ని.. ప్రజాస్వామ్యంగా చెప్పుకునే దుస్థితికి రాకుండా బీజేపీని కాపాడవచ్చు. కానీ రేపు ఆ పార్టీకి నాయకత్వ లోపం తలెత్తుతుంది. అది శాపంగా మారుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. 


Also Read : 6 నెలల తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన.. బైడెన్‌తో భేటీలో ఈ అంశాలపైనే చర్చ!