దేశంలో భారీ ఉగ్రకుట్రను పన్నిన ఆరుగురు ఉగ్రవాదులకు దిల్లీ పటియాలా హౌస్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మంగళవారం వీరిని దిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు పాకిస్థాన్‌లో శిక్షణ తీసుకున్నారు.
వీళ్లెవరంటే..?
ఈ ఉగ్రవాదులను మూల్ చంద్, జీషన్ ఖమర్, మహ్మద్ అబూబకర్, మహ్మద్ అమీర్ జావేద్, జాన్ మహమ్మద్ అలీ షేక్, ఒసామాగా గుర్తించారు. వీరిలో ఒసామా, జీషన్ ఖమర్ పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరిని మస్కట్ మీదుగా పాక్ తీసుకెళ్లి బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన కసబ్ తీసుకున్న తరహా శిక్షణ వీరు పొందినట్లు సమాచారం.
భారత్‌లో పండుగలను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు ఈ ముఠా కుట్రలు పన్నింది. వినాయక నిమజ్జనం సందర్భంగా పేలుళ్లు జరిపేందుకు ఈ ముఠా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
దావూద్ బ్రదర్‌తో..
దేశంలోని అనేక నగరాల్లో ఉగ్ర దాడులు చేసేందుకు వీరికి పెద్ద ఎత్తున నిధులు, ఆయుధాలు అందినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో అలీ షేక్, మూల్ చాంద్‌లకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు.