Whooping Cough Outbreak: ఎప్పటికప్పుడు కొత్త వ్యాధులు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకూ కొవిడ్‌ వణికించింది. అప్పటి నుంచి కొత్త రకాల జబ్బులు వెంటాడుతున్నాయి. ఇప్పుడు పలు దేశాల్లో Whooping Cough ప్రాణాలు బలి తీసుకుంటోంది. చైనా, ఫిలిప్పైన్స్, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌తో పాటు అమెరికా బ్రిటన్‌లోనూ ఈ దగ్గు బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఇన్‌ఫెక్షన్‌కి Pertussis అనే శాస్త్రీయ నామం ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ని ముందస్తుగా గుర్తించడం సవాలేనని, ముఖ్యంగా చిన్నారులకే ఎక్కువగా సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే చైనాలో 13 మంది ఈ ఇన్‌ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఆ దేశంలో ఇప్పటి వరకూ 32,380 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే ఇది 20 రెట్లు ఎక్కువ. ఫిలిప్పైన్స్‌లో ఈ వారం రోజుల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 54 మంది చనిపోయారు. గతంతో పోలిస్తే ఇక్కడ కేసుల సంఖ్య 34 రెట్లు పెరిగింది.


ఏంటీ వ్యాధి..?


Bordetella pertussis అనే బ్యాక్టీరియా కారణంగా ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. ఇది చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది సోకిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. శరీరంలోకి టాక్సిన్స్‌ విడుదలవుతాయి. ఈ కారణంగానే శ్వాసకోశంలో సమస్యలు వస్తాయి. ఈ వ్యాధి సోకిన మొదట్లో లక్షణాలు ( Whooping Cough Symptoms) జలుబు లక్షణాల తరహాలోనే ఉంటాయి. ముక్కు కారడం, స్వల్ప జ్వరం, పొడి దగ్గు లాంటివి వస్తాయి. వారం రోజుల తరవాతే ఈ లక్షణాలు తీవ్రమవుతాయి. తట్టుకోలేని విధంగా దగ్గు తెగ ఇబ్బంది పెడుతుంది. దాదాపు పది వారాల పాటు ఈ దగ్గు ఇలాగే కొనసాగే అవకాశముంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడేది చిన్నారులే. దగ్గు తీవ్రతను తట్టుకోలేక కొంత మందిలో ఊపిరి ఆగిపోతుంది. టీనేజర్‌లు, పెద్దల్లో లక్షణాలు తక్కువగానే ఉన్నప్పటికీ రాత్రి పూట మాత్రం దగ్గు సతాయిస్తుంది. ఇలా లక్షణాలు కనిపించని వాళ్లు కూడా వేరే వ్యక్తులకు వ్యాప్తి చెందించే ప్రమాదముంది. 


ఈ వ్యాధికి ప్రస్తుతానికి ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ అంటూ ఏమీ లేదు. ఇప్పటికైతే వైద్యులు యాంటీబయోటిక్స్‌ ఇస్తున్నారు. మూడు వారాల కన్నా ఎక్కువ రోజులు దగ్గుతో బాధపడితే వాళ్లకు యాంటీబయోటిక్స్ అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వాళ్లలో బ్యాక్టీరియా ఉండదని,అది వెళ్లిపోయిన తరవాత కూడా దగ్గు కంటిన్యూ అవుతుందని వివరిస్తున్నారు. చైనాలో డిఫ్తేరియా, టెటానస్‌ని ట్రీట్ చేసేందుకు వ్యాక్సిన్‌లు ఇస్తున్నారు. వీటినే వూపింగ్ కాఫ్‌ ఇన్‌ఫెక్షన్‌కీ అందిస్తున్నారు. అమెరికాలో ఇప్పటికి రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. యూకేలో ఇప్పటికే వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఫిలిప్పైన్స్‌లో మాత్రం వ్యాక్సిన్‌లకు కొరత ఉంది. మే నెల వరకూ ఇదే విధంగా కొరత ఉండే అవకాశముంది. 


Also Read: Heat Waves: కోట్లాది మంది చిన్నారులకు ఎండల ముప్పు, హెచ్చరించిన యునిసెఫ్