Apple Warns iPhone Users: ఐఫోన్ యూజర్స్‌కి యాపిల్ అలెర్ట్ ఇచ్చింది. iPhoneలు పెగాసస్ తరహా స్పైవేర్‌ దాడికి గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. భారత్‌తో పాటు మొత్తం 91 దేశాల వినియోగదారులకు ఈ అలెర్ట్ పంపింది. mercenary spyware దాడి చేసే అవకాశముందని వెల్లడించింది. ఏప్రిల్ 11వ తేదీన అర్ధరాత్రి 12.30 నిముషాలకు నోటిఫికేషన్ ఈమెయిల్స్ పంపింది. భారత్‌లోని యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. అయితే...ఎంత మంది యూజర్స్‌కి యాపిల్ కంపెనీ నుంచి ఈ నోటిఫికేషన్స్‌ వచ్చాయన్నది మాత్రం తెలియలేదు. ఈ మెయిల్‌లో NSO గ్రూప్‌కి చెందిన Pegasus spyware గురించీ ప్రస్తావించింది. ఇలాంటి టూల్స్‌ని వినియోగించి వ్యక్తిగత డేటాని చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తేల్చి చెప్పింది. రిమోట్‌గా యాపిల్ ఫోన్‌లను టార్గెట్‌ చేసి వాటిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. 


"ఓ స్పైవేర్ దాడి చేసే ప్రమాదముందని యాపిల్ గుర్తించింది. రిమోట్‌ నెట్‌వర్క్‌తో కొంత మంది టార్గెట్ చేసి మరీ ఈ దాడి చేసే ప్రమాదముంది. మీరెవరో తెలుసుకునేందుకు, మీ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు ఈ దాడి జరుగుతుండొచ్చు. దయచేసి వినియోగదారులంతా ఈ వార్నింగ్‌కి సీరియస్‌గా తీసుకోండి. మీకు వచ్చే లింక్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి. అలాంటి లింక్స్‌ని ఓపెన్ చేయకండి. ఈ థ్రెట్‌ నోటిఫికేషన్స్‌ని గమనించండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు"


- యాపిల్‌ 


ఇలాంటి స్పైవేర్‌లు చాలా అరుదుగా ఉంటాయని, కానీ వాటి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది యాపిల్ కంపెనీ. ఈ దాడులు మొదలైతే లక్షలాది డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదముందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని వినియోగదారులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది సంస్థ. 2021 నుంచి ఇదే తరహా నోటిఫికేషన్‌లు పంపడం మొదలు పెట్టింది యాపిల్. గతేడాది దాదాపు 20 మంది ఇండియన్ యూజర్స్‌కి ఈ తరహా వార్నింగ్స్ వచ్చాయి.