Biological Aging in Women : గర్భం అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ అపురూప ఘట్టం. తల్లిగా మారిన తర్వాత తమ జీవితాన్ని పిల్లలకే ధారపోసే తల్లులు ఎందరో ఉన్నారు. అయితే ఈ గర్భమే మహిళల్లో జీవ సంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తోందని తాజా అధ్యయనం తెలిపింది. న్యూయార్క్​లోని కొలంబియా యూనివర్సిటీ మెయిల్​మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై అధ్యయనం చేశారు. ఈ స్టడీలోవారు విస్తుపోయే విషయాలను కనుగొన్నారు. ఈ రీసెర్చ్​కి సంబంధించిన విషయాలను ప్రోసీడింగ్స్ ఆఫ్​ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్​లో ప్రచురించారు. 


గర్భాల సంఖ్యతో పెరుగుతున్న వృద్ధాప్య ప్రభావం


ఒకే వయసు కలిగిన స్త్రీలలో జీవశాస్త్రపరంగా గర్భం దాల్చిన స్త్రీలు.. గర్భం దాల్చని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారనే అంశాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని ప్రభావం గర్భాల సంఖ్యలతో పెరుగుతుందని తెలిపారు. అంటే పిల్లల సంఖ్య పెరిగేకొద్ది వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. పురుషులలో ఇలాంటి జీవసంబంధమైన వృద్ధాప్యం వంటివి లేవని ఈ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం కోసం దాదాపు 1735 మందిపై వారు పరిశోధనలు చేశారు. దీర్ఘకాలంలో వారి నుంచి పునరుత్పత్తి, డీఎన్​ఏ నమూనాలు తీసుకుని పరిశోధించారు. వృద్ధాప్య ప్రక్రియపై గర్భధారణ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై ఆరోగ్య సర్వేను కొనసాగించారు. వారి నుంచి ఆరు వేర్వేరు బాహ్యజన్యు గడియారాలను ఉపయోగించి.. జీవసంబంధమైన వయస్సును లెక్కించారు. DNA మిథైలేషన్ అనే ప్రక్రియ ద్వారా నమూనాలు సేకరించారు. జీవసంబంధమైన వయసును అంచనా వేశారు. 


దీర్ఘకాలికంగా కొనసాగిన పరిశోధన


ఈ పరిశోధనలో ప్రతి మహిళ ప్రతి గర్భం అదనంగా రెండు నుంచి మూడు నెలల బయోలాజికల్ వృద్ధాప్యంతో ముడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆరేళ్ల ఫాలో అప్​ పీరియడ్​లో గర్భవతులు జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదలను గుర్తించారు. ఈ అంశంపై కొలంబియా ఏజింగ్ సెంటర్​లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. గర్భధారణ జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని.. ఈ ప్రభావాలు యువ, అధిక సంతానోత్పత్తి స్త్రీలలో స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు. 


ప్రతి స్త్రీ గర్భం సంఖ్య కూడా వారిలో జీవసంబంధమైన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. ఇవి వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అయితే కౌమారదశలోని గర్భం దాల్చినవారిపై ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయన్నారు. ఆరోగ్య సంరక్షణ, సరైన వనరులు లేకపోవడం కూడా ప్రభావం చూపిస్తాయి అంటున్నారు. వృద్ధాప్య ప్రక్రియలో గర్భం పాత్ర, పునరుత్పత్తి ఇతర కోణాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే పిల్లలకోసం తమ ప్రాణాలనే పణంగా పట్టి వారిని భూమి మీదకి తీసుకువచ్చే మహిళలకు ఇది పెద్ద సమస్య కాదని సామాజిక వేత్తలు చెప్తున్నారు. గర్భధారణ సమయంలో సరైన ఫుడ్, డైట్​, మానసికంగా హెల్తీగా ఉండడం వల్ల ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. 



Also Read : ఎలాంటి ఎఫర్ట్​ లేకుండా కొంబుచా టీతో బరువు తగ్గిపోతారట.. ఈ ఫంగస్​ టీపై న్యూ స్టడీ ఏమంటుందంటే