US Weather-Related Deaths: బాంబ్ సైక్లోన్, శీతలమైన చలి కారణంగా అమెరికాలో కనీసం 31 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ మంచు తుపాను నగరాన్ని అతలాకుతలం చేసింది. అత్యవసర సేవలు కూడా ఇక్కడకు చేరుకోలేకపోతున్నాయి.
వాతావరణ సంబంధిత పరిస్థితుల కారణంగా దేశంలోని అనేక తూర్పు రాష్ట్రాల్లోని 2 లక్షల మంది నివాసితులపై విద్యుత్తు అంతరాయం ప్రభావం పడింది. చాలా మంది వారి ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ మంచు తుపాను పరిస్థితులు భయపెడుతున్నాయి. చలిగాలులు భయంకరంగా వీస్తున్నాయి.
భయంభయంగా
ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయిలోనే కొనసాగుతుండడంతో ప్రజలు తమ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ కోతలతో హీటర్లు పనిచేయక పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆదివారం ఉదయం 1346 విమాన సర్వీసులు రద్దయ్యాయని ఫ్లైట్‌అవేర్ సంస్థ వెల్లడించింది.
బాంబ్ సైక్లోన్
బాంబ్ సైక్లోన్.. ఏర్పడితే వాతావరణం చాలా ప్రమాదకరంగా మారుతుంది. తుపాను వచ్చినపుడు దాని వాతావరణ పీడనం కనిష్ఠ స్థాయికి పడిపోతే ఆ తుపానును 'బాంబ్ సైక్లోన్' అని పిలుస్తారు. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరంలో హరికేన్ స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. దీనికి తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.
ఇక్కడ ఒక అంబులెన్సు రావడానికి సగటున మూడు గంటల సమయం పడుతోంది. విద్యుత్తు సరఫరా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.
Also Read: China Taiwan Conflict: తైవాన్‌ను చుట్టుముట్టిన చైనా యుద్ధ విమానాలు- యుద్ధం తప్పదా!