Wayanad Tragedy: వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడిన ఘటనలు (Wayanad Landslides) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పలు చోట్ల ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు వెయ్యి మందిని రెస్క్యూ టీమ్స్‌ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే...ఈ విపత్తు నుంచి తప్పించుకున్న వాళ్లు మాత్రం ఆ క్షణాలను తలుచుకుని భయపడిపోతున్నారు. తృటిలో చావు నుంచి తప్పించుకున్నామని చెబుతున్నారు. అయితే...ఓ కుటుంబాన్ని మాత్రం వాళ్ల భయమే కాపాడింది. ముందక్కైలో ఉంటున్న షకీరా భారీ వర్షాలు మొదలైనప్పటి నుంచి విపరీతంగా భయపడుతోంది. ఏదైనా జరిగిపోతుందేమోనని అనుమానంతో ఆమెకి నిద్ర పట్టలేదు. వెంటనే ఇంట్లో వాళ్లను అలెర్ట్ చేసింది. మెప్పడిలోని తల్లిగారింటికి వెళ్లిపోదామని చెప్పింది. కానీ అందుకు ఆమె భర్త ఒప్పుకోలేదు. తరవాత ఎలాగోలా అంగీకరించాడు. వెంటనే కుటుంబ సభ్యులంతా ఆ ఇంటిని విడిచిపెట్టి మెప్పడికి వెళ్లారు. కొద్ది గంటల తరవాత అక్కడ కొండ చరియలు విరిగిపడి ఇళ్లన్నీ ధ్వంసమైపోయాయి. తన భయమే కుటుంబాన్ని కాపాడిందని ఆ మహిళ వివరించింది. 


"దాదాపు రెండు రోజులుగా ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. అప్పటి నుంచి నా భార్య భయపడుతోంది. ఏం జరుగుంతో అని టెన్షన్ పడింది. ఏమీ జరగదు అని నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. వెంటనే అంతా కలిసి అక్కడి నుంచి వచ్చేశాం. కొద్ది సేపటికే అక్కడ విపత్తు ముంచుకొచ్చింది. నా ఇల్లంతా శిథిలమైపోయింది. చుట్టు పక్కల ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి"


- బాధితుడు 






మందక్కైకి కిలోమీటర్ దూరంలో ఉన్న వెల్లడిపర వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయని...ఇక్కడి వరకూ ఆ ప్రభావం ఉంటుందని అసలు ఊహించలేదని బాధితులు చెబుతున్నారు. కొంత మంది వెళ్లిపోదాం అని చెప్పినా వినకుండా అక్కడే ఉండిపోయి ఈ ముప్పునకు బలి అయ్యారని అంటున్నారు. లక్షలు పోసి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేంద్రమంత్రి జార్జ్ కురియన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రిలీఫ్ క్యాంప్‌లలోని బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలను పరిశీలించారు. ప్రస్తుతానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 






 


Also Read: Wayanad Landslide: అర్ధరాత్రి ఇల్లంతా ఒక్కసారిగా ఊగిపోయింది, సాయం కోసం కేకలు వేశాను - వయనాడ్ బాధితురాలు