Delhi News in Telugu: ఢిల్లీ విపరీతమైన వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో అక్కడి పౌరులు అల్లాడిపోతున్నారు. ఇది చాలదన్నట్టు నీటి కొరత వచ్చి పడింది. బెంగళూరు తరహాలోనే నీటి కోసం తీవ్ర (Delhi Water Crisis) అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే Delhi Jal Board కీలక ప్రకటన చేసింది. నీటిని వృథా చేస్తే రూ.2 వేల జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. వడగాలులతో ఇబ్బంది పడుతున్న సమయంలో నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ఇళ్లలోని వాటర్ ట్యాంక్‌లలో నీళ్లు పొంగిపోయే వరకూ నిర్లక్ష్యంగా ఉండడం, ఇష్టమొచ్చినట్టు కార్‌లు, వాహనాలు కడగడం లాంటివి చేయకూడదని ఢిల్లీ జల్‌ బోర్డ్‌ స్పష్టం చేసింది.


ప్రస్తుత నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ఇలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వివరించింది. నిర్మాణ పనులకు ఇళ్లలోని నీటిని వాడుకోకూడదని హెచ్చరించింది. నీటిని వృథా చేసే వారిపై నిఘా పెట్టేందుకు ఢిల్లీ వ్యాప్తంగా 200 టీమ్స్‌ని సిద్ధం చేస్తోంది. అక్రమ కుళాయి కనెక్షన్‌లను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మే 30వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఈ టీమ్స్‌ రంగంలోకి దిగుతాయని ఢిల్లీ జల్‌ బోర్డ్‌ వెల్లడించింది. 






యమునా నదిలో తగ్గిన నీటిమట్టం..


హరియాణా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీళ్ల పంపిణీ నిలిచిపోయిందని, అందుకే యమునా నదిలో నీటి మట్టం తగ్గిపోయిందని మంత్రి అతిషి వెల్లడించారు. ఢిల్లీలో వాటర్‌ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్‌లో నీళ్లు తగ్గిపోయాయని వివరించారు. కొద్ది వారాలుగా అందుకే నీటికి కొరత ఏర్పడిందని తెలిపారు. ఉక్కపోత కారణంగా ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ కూడా అనూహ్యంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 8,302  మెగావాట్‌ల విద్యుత్ వినియోగం నమోదవుతోంది. ఏసీలు,కూలర్లు విపరీతంగా వాడడం వల్ల విద్యుత్‌పై భారం పడుతోంది. ఇక రాజస్థాన్‌లోని ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 






Also Read: Cancer Treatment: వేల ఏళ్ల క్రితమే క్యాన్సర్‌కి చికిత్స, ఈజిప్టియన్‌లు అద్భుతాలు చేశారా?