Money Making Ideas For A Middle-Class Retiree: పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పే అని ఒక సినిమాలో డైలాగ్‌ ఉంది. వినడానికి కఠినంగా ఉన్నా ఇదే నిజం. అయితే, తరాలు మారే కొద్దీ ప్రజల జీవన విధానం మెరుగవుతూ వస్తోంది. గట్టిగా ప్రయత్నిస్తే పేదవాళ్లు మధ్య తరగతిలోకి మారొచ్చు. మధ్య తరగతి వాళ్లు సంపన్నులుగా మారడానికి మాత్రం అసాధ్యంగా మారుతోంది. ప్రస్తుతం, మన దేశంలో ఉన్న మెజారిటీ వర్గం మిడిల్‌ క్లాస్‌. 


మధ్య తరగతి ఆదాయంతో పదవీ విరమణ చేసిన వ్యక్తి, రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆర్థిక సమస్యలతో పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి, ఆ డబ్బును మరో 30 సంవత్సరాల వరకు ఎలా కొనసాగించాలనే దానిపై సరైన వ్యూహం ఉండాలి. బడ్జెట్‌కు కట్టుబడి ఖర్చు పెట్టినంత మాత్రాన డబ్బును నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. అంతకుమించిన ప్రణాళిక కచ్చితంగా అవసరం. రిటైర్‌మెంట్‌ తర్వాత ఇబ్బంది లేని జీవితం గడపాలి అనుకుంటే, విభిన్న ఆర్థిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలి. ఆదాయంతో సంబంధం లేకుండా దాదాపు అన్ని వర్గాలకు ఇది వర్తిస్తుంది. 


మిడిల్‌ క్లాస్‌లో పదవీ విరమణ చేసినా, డబ్బును మీ చుట్టూ తిప్పుకునే ఐదు సూత్రాలు:


1. చిన్న ఇంటికి మారడం
ఇది చాలా కీలక విషయం. సాధారణంగా, ఒక వ్యక్తి రిటైర్‌ అయ్యే సమయానికి అతని/ ఆమె సంతానం కూడా వివిధ ప్రదేశాల్లో సెటిల్‌ అయి ఉండొచ్చు. అప్పుడు, రిటైరీ & అతని జీవిత భాగస్వామి మాత్రమే ఆ ఇంట్లో మిగులుతారు. ఒకవేళ మీది పెద్ద ఇల్లు అయితే, దానికి యుటిలిటీ బిల్లులు, ఆస్తి పన్నులు, బీమా ఖర్చులు వంటివి చెల్లించడం దండగ. ఆ ఇంటిని అమ్మి మరో చిన్న ఇంటిని కొనడం లేదా అద్దెకు తీసుకోవడం మంచి ఆలోచన. డబ్బున్న వాడు ఇల్లు కడితే తెలివైన వాడు అద్దెకు ఉంటాడన్నది ఒక సామెత. పెద్ద ఇంటిని అమ్మడం వల్ల లాభాలు రావడం మాత్రమే కాదు, చాలా అదనపు ఖర్చులు తగ్గుతాయి. మీ డబ్బు పెరుగుతుంది.


2. పెట్టుబడుల్లో వైవిధ్యం
ఇప్పటికే మీరు పెట్టుబడులు ప్రారంభిస్తే, పదవీ విరమణ చేసిన తర్వాత వాటిని ఆపేయడం తొందరపాటు అవుతుంది. నిజానికి, పెట్టుబడి వ్యూహాలు పెంచుకోవడానికి ఇదే సరైన సమయం. రిటైర్మెంట్‌ తర్వాత మీకు వచ్చిన డబ్బును వివిధ ఆస్తి వర్గాల్లో పెట్టుబడిగా పెడితే, జీవితాంతం ఆ డబ్బు పెరుగుతూనే ఉంటుంది.


3. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే ప్రణాళిక
పెరుగుతున్న ధరల ప్రభావాన్ని పట్టించుకోకపోవడం అనేది పదవీ విరమణ చేసినవారు చేసే అతి పెద్ద తప్పు. దీనివల్ల ఖర్చు చేసే స్థోమత ఏటికేడు తగ్గుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి... ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇచ్చే ఆస్తుల్లో పదవీ విరమణ డబ్బును పెట్టుబడిగా పెట్టడం ఉత్తమ వ్యూహం.


4. అదనపు ఆదాయం
మన దేశంలో, రిటైర్మెంట్‌ తర్వాత రిలాక్స్‌ అయ్యే వాళ్లే ఎక్కువ మంది. 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసినప్పటికీ, ఇంకా పని చేసే శక్తి వాళ్లలో ఉంటుంది. పైగా, అప్పటి వరకు పని చేసిన రంగంలో అపార అనుభవం & విజ్ఞానాన్ని సొంతం చేసుకుని ఉంటారు. కాబట్టి, పదవీ విరమణ తర్వాత కూడా ఆదాయం కోసం ప్రయత్నించాలి. లైబ్రేరియన్, ట్యూటర్‌లు, కన్సల్టెంట్‌, టీచింగ్‌ సహా చాలా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు సీనియర్‌లకు అనుకూలంగా ఉంటాయి. దీనివల్ల అదనపు ఆదాయం సొంతమవుతుంది.


5. సామాజిక భద్రత
రిటైర్మెంట్‌ ప్రయోజనాలను వెంటనే తీసుకోవాలనే రూల్‌ లేదు. మీకు డబ్బుకు ఇబ్బంది లేకపోతే, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను మరికొంతకాలం పాటు అవే ఖాతాల్లో కొనసాగించాలి. మీరు ఎంత ఎక్కువ కాలం ఓపికపడితే, మీ పెన్షన్‌ మొత్తం అంత పెరుగుతుంది. ఉదాహరణకు... 62 సంవత్సరాల వయస్సులో పెన్షన్‌ తీసుకోవడానికి బదులు 70 సంవత్సరాల నుంచి తీసుకోవడం ప్రారంభించొచ్చు. దీనివల్ల పెన్షన్‌ మొత్తం భారీగా పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఈ రేంజ్‌లో పెరుగుతున్న గోల్డ్‌ను ఇక కొనగలమా? - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి