Steps To Withdraw PF Balance Online and Offline: ఉద్యోగులకు, పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత కల్పించేందుకు పని చేస్తున్న సంస్థ ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO). ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మూల వేతనం (Basic Salary) నుంచి 12%, సంస్థ నుంచి 12% చొప్పున ఆ ఉద్యోగి ఖాతాలో జమ అవుతాయి. కంపెనీ చెల్లించే 12%లో 8.33% ఎంప్లాయీ పెన్షన్‌ స్కీమ్‌లోకి (EPS), మిగిలిన 3.67% మొత్తం ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF) ఖాతాలో జమ అవుతుంది. సభ్యుడి ఖాతాలో జమ అయిన మొత్తంపై కేంద్ర ప్రభుత్వం ఏటా వడ్డీ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 8.25%.


EPF ఖాతా నుంచి డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి? (How To Withdraw PF Amount?)


EPF ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం, సభ్యుడి UAN యాక్టివేట్‌గా ఉండాలి, UANకి లింక్ చేసిన ఫోన్ నంబర్‌ కూడా యాక్టివ్‌గా ఉండాలి. దీంతోపాటు, EPFO డేటాబేస్‌లో సభ్యుడి వివరాలు సరిగా అప్‌డేట్ అయ్యాయో, లేదో చెక్‌ చేసుకోవాలి. 


భౌతిక దరఖాస్తు: (How To Withdraw PF Balance Offline?)


- కాంపోజిట్‌ క్లెయిమ్‌ ఫారం (ఆధార్‌): UAN పోర్టల్‌లో మీ ఆధార్-బ్యాంక్ వివరాలు లింక్ అయివుంటే ఈ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించాలి. ఆ ఫారంలో అడిగిన వివరాలన్నీ నింపి, తగిన పత్రాలు జత చేసిన తర్వాత... ఈ కేస్‌లో, కంపెనీ యాజమాన్యం ధృవీకరణ అవసరం లేకుండా నేరుగా EPFO కార్యాలయానికి ఫారం సబ్మిట్‌ చేయవచ్చు.


- కాంపోజిట్ క్లెయిమ్ ఫారం (నాన్‌ ఆధార్): UAN పోర్టల్‌లో మీ ఆధార్-బ్యాంక్ వివరాలు లింక్ కాకపోతే ఈ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించాలి. వివరాలు నింపిన తర్వాత... ఈ కేస్‌లో, కంపెనీ యాజమాన్యం ధృవీకరణతో EPFO కార్యాలయంలో అప్లికేషన్‌ ఇవ్వాలి.


ఆన్‌లైన్‌లో అప్లై చేయడం: (How To Withdraw PF Balance Online?)


పీఎఫ్‌ విత్‌డ్రా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం వల్ల చాలా సమయం కలిసి వస్తుంది. ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన శ్రమ తప్పుతుంది. ఈ విధానంలో కూడా UAN (Universal Account Number), లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ యాక్టివ్‌గా ఉండాలి. UAN-KYC (ఆధార్, పాన్ వంటివి) అప్‌డేషన్‌ పూర్తై ఉండాలి.


- మీ UAN & పాస్‌వర్డ్ ఉపయోగించి EPFO e-SEWA పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ‘Online Services’ విభాగంలోకి వెళ్లి, ‘Claim (Form-31, 19, 10C & 10D)’ ఎంచుకోవాలి.
- ధృవీకరణ కోసం మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఇక్కడ ఎంటర్‌ చేయాలి.
- టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ బాక్స్‌లో టిక్‌ పెట్టి, ఆన్‌లైన్ క్లెయిమ్‌ కోసం కంటిన్యూ అవ్వాలి.
- ఇప్పుడు, డ్రాప్‌డౌన్ మెను నుంచి విత్‌డ్రా కారణాన్ని ఎంచుకోవాలి.
- అవసరమైన వివరాలను నమోదు చేసి, తగిన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
- వివరాలు నింపాక, OTP కోసం రిక్వెస్ట్‌ పంపాలి. మీ ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- సంబంధిత గడిలో OTPని నమోదు చేసి సబ్మిట్‌ కొట్టండి. అంతే, పీఎఫ్‌ విత్‌డ్రా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినట్లే.


UAN లేకున్నా పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా చేయొచ్చు (PF Amount Withdrawal Without UAN)


ఒకవేళ మీకు UAN లేకపోయినా పర్లేదు, EPF ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయొచ్చు. దీనికోసం... ఆధార్ లేదా నాన్-ఆధార్ కాంపోజిట్ క్లెయిమ్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసి వివరాలు నింపాలి. పూర్తి చేసిన ఫారానికి సంబంధిత పత్రాలు జత చేసి మీ రీజినల్‌ PF ఆఫీస్‌లో ఇవ్వాలి. ఇక్కడితో మీ పని పూర్తవుతుంది, ఆఫీస్‌ పని మొదలవుతుంది. డబ్బు మీ బ్యాంక్‌ ఖాతా జమ కావడానికి కొన్ని రోజులు పడుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఎల్‌ఐసీ నుంచి ఆరోగ్య బీమా పాలసీ - ఒకే ప్లాన్‌లో లైఫ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌!