LIC Wants To Enter Into Health Insurance: ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ (Life Insurance Corporation) అంటే, జీవిత బీమా కంపెనీగానే మనందరికీ తెలుసు. భవిష్యత్‌లో, ఇది ఆరోగ్య బీమా సంస్థగానూ మారే అవకాశం ఉంది. జీవిత బీమా రంగంలో విజేతగా ఉన్న ఎల్‌ఐసీ, ఇకపై ఆరోగ్య బీమా బరిలోకి కూడా దిగి, అక్కడ కూడా జయకేతనం ఎగరేయాలనుకుంటోంది. ఇందుకోసం, ఇప్పటికే ఆరోగ్య బీమా అందిస్తున్న కంపెనీలను కొనే అవకాశాలు ఉన్నాయి. ఎల్‌ఐసీ ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి (LIC Chairman Siddhartha Mohanty) ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు.
ఆరోగ్య బీమా పాలసీలు పెరుగుతాయని అంచనా
2022-23 ఆర్థిక సంవత్సరం (FY23) చివరి నాటికి, మన దేశంలో కేవలం 2.3 కోట్ల ఆరోగ్య బీమా పాలసీలు మాత్రమే అమల్లో ఉన్నాయి. 55 కోట్ల మందిని మాత్రమే ఈ పాలసీలు కవర్ చేస్తున్నాయి. ప్రభుత్వాలు కల్పించే ఆరోగ్య బీమా దాదాపు 30 కోట్ల మందిని, గ్రూప్ ఇన్సూరెన్స్ దాదాపు 20 కోట్ల మందిని కవర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 143 కోట్ల జనాభాలో మిగిలిన వాళ్లకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. ముఖ్యంగా, వ్యక్తిగత పాలసీలు నామమాత్రంగా ఉన్నాయి. దీనర్ధం.. ఆరోగ్య బీమా మార్కెట్ ప్రజల్లోకి పూర్తిగా చొచ్చుకుపోలేదు, చాలా అవకాశాలు మిగిలే ఉన్నాయి. LIC అడుగు పెడితే, ఆరోగ్య బీమా రంగంలో ఊపు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతీయ బీమా కంపెనీల నియంత్రణ సంస్థ IRDAI (Insurance Regulatory and Development Authority) ఇచ్చిన సమాచారం ప్రకారం... జీవిత బీమా సంస్థలు FY23లో దాదాపు 3 లక్షల మందిని కవర్ చేస్తూ 2.9 లక్షల కొత్త పాలసీలను మాత్రమే జారీ చేశాయి.
కాంపోజిట్ లైసెన్స్
జీవిత బీమా పాలసీలతో క్షేత్ర స్థాయిలోకి చొచ్చుకుపోయిన ఎల్‌ఐసీ, ఇప్పటి వరకు ఆరోగ్య బీమా పాలసీలను తీసుకురాకపోవడానికి ఒక కారణం ఉంది. భారతీయ బీమా చట్టం-1938 (Insurance Act 1938)తో పాటు, IRDAI నియమాల ప్రకారం... ఒకే సంస్థ జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమా సేవలు అందించకూడదు. ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ ప్రవేశించకపోవడానికి ఈ నిబంధనలే అడ్డంకి. అయితే, ఈ నిబంధనలు సడలించి, 'కాంపోజిట్ లైసెన్స్'లను (Composite License) ఐఆర్‌డీఏఐ జారీ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
కాంపోజిట్ లైసెన్స్ అంటే ఏంటి? (What Is Composite License?)
జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమా సేవలన్నింటినీ ఒకే కంపెనీ అందించేలా అనుమతించేదే కాంపోజిట్ లైసెన్సింగ్. కాంపోజిట్ లైసెన్స్‌లను జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సిఫార్సు చేసింది. దీనికోసం బీమా చట్టంలో సవరణలు చేయాలని సూచించింది. ఈ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మార్కెట్‌లో చెప్పుకుంటున్నారు. అవకాశం వస్తే ఆరోగ్య బీమా రంగంలోకి ఎంట్రీ ఇస్తామంటూ ఎల్‌ఐసీ ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి చేసిన కామెంట్లు కూడా దీనికి బలాన్ని ఇస్తున్నాయి.
ప్రజలకు ఉపయోగం ఉంటుందా?
కాంపోజిట్ లైసెన్సింగ్‌ను అనుమతించడం వల్ల బీమా కంపెనీలకే కాదు, ప్రజలకు కూడా ప్రయోజనాలు అందుతాయి. ఒకే పాలసీ నుంచి వివిధ రకాల బీమా కవరేజ్‌లు పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రీమియం ఖర్చులు, ఇబ్బందులు తగ్గుతాయి. ఎల్‌ఐసీకి కాంపోజిట్ లైసెన్స్ వస్తే, లైఫ్ & హెల్త్ ఇన్సూరెన్స్‌ను కలుపుతూ ఈ సంస్థ నుంచి ఉమ్మడి పాలసీలు లాంచ్ అవుతాయి. దీనివల్ల పాలసీలు తీసుకునే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి