Watch Video:
గుజరాత్‌లో మోర్బి వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో చూశాం. కేవలం బ్రిడ్జ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే వందలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికే దీనిపై విచారణ వేగంగా సాగుతోంది. ఈ వంతెన కూలిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆగ్రహానికి గురి చేస్తోంది. నార్త్ కర్ణాటకలో ఓ తీగల వంతెనపై
కార్ నడుపుతున్న వీడియో ఇది. ఓ డ్రైవర్ తన కారుని వంతెనపైకి తీసుకొచ్చి రివర్స్ గేర్‌లో మళ్లీ వెనక్కి తీసుకెళ్తుండగా స్థానికులు వీడియో తీశారు. చుట్టు పక్కల ఉన్న వాళ్లు గట్టిగా అరుస్తున్నారు. అయినా ఆ డ్రైవర్ ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రమాదకరమైన సాహసం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్‌పై మండి పడుతున్నారు. మోర్బి ఘటన చూశాక కూడా బుద్ధి రాలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.