Vladimir Putin - G20 summit:
ఒక్కవార్తతో సంచలనం..
రష్యా అధ్యక్షుడు పుతిన్ భయపడుతున్నారట. ఇప్పటికే ఆయనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచి కాస్త అప్రమత్తంగా ఉంటున్నారు. అందుకే..ఈ సారి G20 సదస్సుకి కూడా హాజరు కావడం లేదని ఓ బ్రిటీష్ న్యూస్‌పేపర్ రాసిన వార్త అంతర్జాతీయంగా సంచలనమవుతోంది. ప్రాణభయం వల్లే ఆయన ఈ సమ్మిట్‌కు హాజరు కావటం లేదని వెల్లడించింది ఆ వార్తా సంస్థ. " యూఎస్, యూకే, ఉక్రెయిన్ స్పెషల్ సర్వీసెస్ పుతిన్‌పై హత్యాయత్నం చేసే అవకాశాలున్నాయి. పశ్చిమ దేశాలు ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నాయి" అని చెప్పింది. అయితే...పుతిన్ హాజరు కాకపోవడంపై మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. జీ20 సదస్సుకి ఉక్రెయిన్ కూడా హాజరు కానుంది. నేరుగా ఉక్రెయిన్‌తో చర్చించేందుకు ఇష్టపడని పుతిన్, ఆ సమావేశానికి రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆయనకు బదులుగా
రష్యా విదేశాంగమంత్రిని పంపాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ సదస్సు ఇండోనేషియా రాజధాని బాలిలో జరగనుంది. ఈ మేరకు ఇండోనేషియా అధికారులు కూడా పుతిన్ రావడం లేదని ప్రాథమికంగా వెల్లడించారు. ఉక్రెయిన్ విషయంలో ప్రశ్నలు ఎదుర్కోవటానికి, ఇతర దేశాలతో చర్చించడానికి పుతిన్ ఇష్టపడటం లేదని చెప్పారు. రష్యాను G20 నుంచి తొలగించాలని ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "బాలిలో జరగనున్న సదస్సుకి వెళ్లినప్పుడు పుతిన్‌కు ఎదురు పడతారా..? ఏమైనా మాట్లాడతారా..?" అని బైడెన్‌ను ప్రశ్నించగా.."అది ఆయన ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అదే దాన్ని బట్టి ఉంటుంది" అని సూటిగా సమాధానం చెప్పారు బైడెన్.
ఎన్నోసార్లు హత్యాయత్నాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఇటీవలే హత్యాయత్నం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగినట్టు టెలీగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. ఎప్పుడు ఈ దాడి జరిగిందన్న విషయంలో మాత్రం స్పష్టత లేకపోయినా...ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అక్కడి మీడియా చెబుతోంది. పుతిన్ ప్రయాణిస్తున్న కార్ ఎడమవైపు వీల్‌ను భారీ శబ్దంతో పేలిందని, ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయట పడ్డారని టెలిగ్రాఫ్ వివరించింది. కారులో నుంచి పొగలు రావటం వల్ల వెంటనే పుతిన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు పేర్కొంది. బ్యాకప్ కాన్వాయ్‌లో ఆయనను అధికారిక నివాసానికి పంపినట్టు తెలిపింది. ఓ ఎస్కార్ట్‌కు ఆంబులెన్స్ అడ్డు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. తన అధికారిక నివాసానికి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఇప్పుడే కాదు. గతంలోనూ పుతిన్‌పై పలుసార్లు హత్యాయత్నం జరిగింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు పాల్పడినప్పటి నుంచి ఆయనకు ఈ థ్రెట్ పెరిగింది. సొంత దేశంలోనే కొన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు పుతిన్. ఆయనపై దాడి జరగటానికి ఇదీ ఓ కారణమై ఉంటుందని అంతర్జాతీయ మీడియా భావిస్తోంది. గతంలో ఓ సారి కాకసస్ పర్యటనలో ఉండగా...పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని...ఉక్రెయిన్‌లోని డిఫెన్స్ విభాగం చెప్పింది. ఆ వివరాలు సీక్రెట్‌గా ఉంచినప్పటికీ.. 2017లో ఓసారి స్వయంగా పుతిన్ సంచలన విషయం చెప్పారు. తనను చంపేందుకు ఐదు సార్లు ప్రయత్నించారని చెప్పారు.
Also Read: Twitter Bankruptcy: ఇది యాపారం- అలా చేయకపోతే ట్విట్టర్ దివాలా ఖాయం!