Twitter Bankruptcy: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్.. రోజుకో బాంబు పేలుస్తున్నారు. తాజాగా ట్విట్టర్ (Twitter) దివాలా (Bankruptcy) తీసే ప్రమాదం ఉందని ఎలాన్ మస్క్.. సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
శాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీసులో ఉద్యోగులతో మస్క్ సమావేశమైనట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
ఉద్యోగులకు షాక్
ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తయిన కొన్ని రోజులకే మస్క్ భారీ సంఖ్యలో సంస్థ ఉద్యోగుల్ని తొలగించారు. మరికొంత మంది స్వచ్ఛందంగా వైదొలుగుతున్నారు. వారంలో 80 గంటలు అంటే రోజుకు 12 గంటలపైనే పనిచేయాలని ఉద్యోగులకు మస్క్ సూచించినట్లు సమాచారం. అలాగే ఉచిత భోజనం, వర్క్ ఫ్రమ్ హోం వంటి సదుపాయాల్ని వదులుకోవడానికి సిద్ధపడాలని కోరారట. ఇవి నచ్చనివారు రాజీనామా చేయొచ్చని మస్క్ చెప్పారట.
ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీంట్లో 13 బిలియన్ డాలర్లు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. ఏడు బ్యాంకులు ఈ మొత్తాన్ని సమకూర్చాయి.
బ్లూ టిక్ ఛార్జీలు
ట్విట్టర్‌లో బ్లూటిక్‌కు మస్క్ ఇప్పటికే ఛార్జీలు ప్రకటించారు. అమెరికా, యూకే సహా కొన్ని దేశాల్లో ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. తాజాగా భారత్‌లోనూ ఈ ఛార్జీలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బ్లూటిక్ ఛార్జీలపై కొందరు యూజర్లకు సందేశాలు వచ్చాయట. భారత్‌లో ఈ సబ్‌స్క్రిషన్‌కు నెలకు రూ.719 కట్టాలట.
అయితే ప్రస్తుతానికి ఐఓఎస్ (ఐఫోన్) యూజర్లకు మాత్రమే ఈ మెసేజ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ మెసేజ్‌లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్‌షాట్లు తీసి ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్ చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే బ్లూటిక్ వస్తుంది.
Also Read: US Mid-Term Polls: అగ్రరాజ్యంలో రికార్డు- 23 ఏళ్లకే చట్టసభకు ఎన్నికైన భారతీయ అమెరికన్!