Jio 5G service in Hyderabad: హైదరాబాద్ జనానికి ఒక జబర్దస్త్ న్యూస్. భాగ్యనగరంలోనూ జియో ఐదో తరం లేదా 5G సేవలు ప్రారంభమయ్యాయి. 5G సిగ్నల్స్ స్మార్ట్‌ఫోన్లకు అందుతున్నాయి.
దక్షిణ భారతదేశ టెక్ సిటీలు హైదరాబాద్, బెంగళూరులో 5G సర్వీస్‌ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (Reliance Jio Infocomm Limited) అందుబాలోకి తెచ్చింది.
"నవంబర్ 10 నుంచి హైదరాబాద్, బెంగుళూరులోని జియో వినియోగదారులకు Jio వెల్‌కమ్ ఆఫర్‌కు ఆహ్వానం అందుతుంది. మీరు 1 Gbps పైగా వేగంతో అపరిమిత డేటాను ఎంజాయ్ చేయవచ్చు" అని పేర్కొంటూ, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఫ్లాగ్‌షిప్ టెలికాం కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.
జియో 5G వెల్‌కమ్ ఆఫర్
హైదరాబాద్, బెంగళూరులో జియో ట్రూ 5G లాంచ్‌తో పాటు, ఈ రెండు నగరాల్లోని వినియోగదారులకు ఒక వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్ ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా.. ఈ రెండు నగరాల్లోని జియో ట్రూ 5G కస్టమర్లు పూర్తి ఉచితంగా 5G సేవలు పొందుతారు. అదనంగా అర కాణీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, 1 Gbps పైగా వేగంతో అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చు.
Jio తన ట్రూ 5G బీటా సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో దశల వారీగా విడుదల చేస్తోంది. ఈ సేవలను ఉపయోగించుకుంటున్న కస్టమర్ల అభిప్రాయాలు, సూచనలు (ఫీడ్‌బ్యాక్) కోరుతోంది.
ఇప్పటికే.. ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నాథ్‌ద్వారా నగరాల్లో జియో ట్రూ 5G సేవల బీటా వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరుకు కూడా బీటా వెర్షన్‌తో వచ్చి తన పరిధిని మరింత విస్తరించింది.
బీటా వెర్షన్ అంటే..
బీటా వెర్షన్ అంటే ప్రయోగాత్మక విధానం. ఒక ప్రోగ్రామ్ లేదా అప్లికేషన్ లేదా యాప్ ప్రారంభ దశ ఇది. అన్ని ప్రధాన ఫీచర్లు ఇందులో ఉంటాయి. కానీ, సంపూర్ణంగా అభివృద్ధి కాని కార్యక్రమం ఇది. కొన్నిసార్లు, బీటా వెర్షన్ కోసం దరఖాస్తు చేసున్నవారికి మాత్రమే దీనిని ఆయా సంస్థలు అందిస్తాయి. మరికొన్ని సార్లు, సదరు సంస్థలే కొంతమంది వ్యక్తులు లేదా సమూహాలు లేదా ప్రాంతాలను ఎంచుకుని వారికి మాత్రమే బీటా వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా అందిస్తాయి. వాటిని వినియోగించే వాళ్ల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటాయి. ఆ ఫీడ్‌బ్యాక్‌ను బట్టి ఒక ప్రోగ్రామ్ లేదా అప్లికేషన్‌ను మరింత ఆకర్షణీయంగా, సులువుగా వినియోగించేలా మారుస్తాయి. ఇదంతా పూర్తయి, అంతా బాగుంది అనుకున్న తర్వాత ఫుల్ వెర్షన్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తాయి. ఏ కంపెనీ అయినా బీటా వెర్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. దీని కోసం ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
హైదరాబాద్, బెంగళూరులోనూ జియో 5G సేవల బీటా వెర్షన్ వాడుకలోకి వచ్చింది. బీటా వెర్షన్ కాబట్టి, నగరం మొత్తం కాకుండా, కొన్ని ప్రాంతాలకే ఈ సేవలను కంపెనీ పరిమితం చేసింది. ఈ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్లు జియో 5జీ సిగ్నల్స్ అందుకోవాలంటే, వాళ్ల స్మార్ట్‌ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలి. ఇప్పటికే అప్‌డేట్ చేసుకుని 5G సేవలు ఆటోమేటిక్‌గా అందుతాయి.
ఇప్పటికే ట్రూ 5G బీటా వెర్షన్ లాంచ్ చేసిన నగరాల్లో లక్షలాది వినియోగదారులు 5G సర్వీసులు వినియోగించుకుంటున్నారని, 500 Mbps నుంచి 1 Gbps వేగాన్ని అనుభవిస్తున్నారని రిలయన్స్ జియో తెలిపింది. బెస్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది.
రిలయన్స్ జియోకు దేశవ్యాప్తంగా 425 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే ఎయిర్‌టెల్ 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ కస్టమర్లు 5G సర్వీసులను వినియోగించుకుంటున్నారు.