Exit Polls Ban:
ప్రసారం చేయడానికి వీల్లేదు..
ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఫలానా పార్టీ గెలుస్తుందని, ఫలానా పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయని ఏవేవో అంచనాలు వేసేస్తాయి. అందులో కొన్ని నిజమవుతాయి. చాలా మటుకు ఆ అంచనాలు అందుకోవు. ఇవి నిజమైనా కాకపోయినా...అందరికీ ఆసక్తి మాత్రం ఉంటుంది. ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఎగ్జిట్ పోల్స్‌పై అందరి దృష్టి నెలకొంది. ఈ తరుణంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఓ సంచలన ప్రకటన చేసింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌ని ప్రసారం చేయడానికి, ప్రచురించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వాటిపై పూర్తిగా నిషేధం విధించింది. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా మరో 48 గంటలపాటు ఒపీనియన్ పోల్స్‌పై ఇప్పటికే నిషేధం అమలు చేస్తోంది. ఈ మేరకు ఈసీ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్‌లో ఏముంది..?
Representation of the People Act 1951 సెక్షన్ 126Aలోని సబ్ సెక్షన్ ప్రకారం..నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5.30 నిముషాల వరకూ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ కాపీని రెండు రాష్ట్రాల ఎన్నికల అధికారులకు పంపింది. ఈ గెజిట్ ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది. అన్ని మీడియా ఛానల్స్‌కు, దిపత్రికల యాజమాన్యాలకు ఇది వివరించాలని చెప్పింది. రేడియో ఛానల్స్‌లోనూ వీటి గురించి చర్చ ఉండకుండా జాగ్రత్త పడాలని వెల్లడించింది.
అభ్యర్థుల జాబితా విడుదల చేసి బీజేపీ..
మొత్తం 182 నియోజకవర్గాలున్న గుజరాత్‌లో బీజేపీ ఒకేసారి 160 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 14 మంది మహిళలు కాగా, 13 మంది ఎస్‌సీ వర్గానికి, 24 మంది ఎస్‌టీ వర్గానికి చెందిన వారు. మొత్తం 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి పోటీ చేసే అవకాశమిచ్చింది బీజేపీ. "ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అభ్యర్థుల పేర్లలో మార్పులు చేర్పులు సహజం. ఈ సారి కూడా అదే జరిగింది. ఎన్నో చర్చలు, సర్వేల తరవాత తుది జాబితాను సిద్ధం చేశాం. చాలా మంది కొత్త వాళ్లకు ఈ సారి అవకాశం ఇచ్చాం. అత్యధిక మెజార్టీతో వీళ్లంతా గెలవాలని కోరుకుంటున్నాం" అని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాటిదార్ వర్గానికి చెందిన హార్దిక్ పటేల్‌కు టికెట్ ఇచ్చి...ఆ వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది బీజేపీ. అటు ఆప్ కూడా కాస్త గట్టిగానే బీజేపీని ఢీకొట్టాలని వ్యూహ రచన చేస్తోంది.
Also Read: Gujarat elections 2022: నదిలో దూకి ప్రాణాలు కాపాడాడు, ఎమ్మెల్యే టికెట్ కొట్టేశాడు